ట్విషా శర్మ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | Twisha Sharma Death Case Latest Update | Sakshi
Sakshi News home page

ట్విషా శర్మ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

May 20 2026 7:57 PM | Updated on May 20 2026 8:19 PM

Twisha Sharma Death Case Latest Update

భోపాల్‌ : మాజీ మిస్‌ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ప్రకారం ఆమెది హత్య కాదు, ఆత్మహత్యేనని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఇదే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. 

మే 12న ట్విషా తన అత్తగారింటి టెర్రస్‌లో జిమ్ పరికరాన్ని ఉపయోగించి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా పోస్టుమార్టం ఫలితాలతో సరిపోలిందని కమిషనర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కోరితే రెండో పోస్టుమార్టం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు.

అయితే ట్విషా తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు ఎదుర్కొన్నందువల్లే ఆమె ప్రాణం కోల్పోయిందని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ట్విషా శర్మ భర్త సమ్రత్ సింగ్‌ లాయర్ కాగా.. అత్త గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి. ప్రస్తుతం భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. అత్తగారు న్యాయవాద నేపథ్యం ఉన్నవారు కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ట్విషా తండ్రి ఆరోపించారు.

కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేసు స్వతంత్రంగా, వేగంగా దర్యాప్తు జరుగుతోందని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను కేవలం రెండు రోజుల్లోనే నమోదు చేశామని, నిందితుడు సమ్రత్‌ను పట్టుకోవడానికి బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. అరెస్టులో ఆలస్యం జరిగినా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు.

ట్విషా శర్మ, సమ్రత్ సింగ్‌ల వివాహం 2024 డిసెంబర్‌లో జరిగింది. ఇద్దరి పరిచయం ఒక డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు ఈ విషాదానికి కారణమయ్యాయని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. 

ట్విషా శర్మ మరణించిన సమయంలో ఆమె భర్త సమ్రత్ సింగ్,పొరిగింటి వ్యక్తి, ఇంట్లో సహాయకుడు అనుమానస్పదంగా కనిపించారు. వీరు ముగ్గురూ ఆమెను మెట్లపై నుంచి కిందికి తీసుకువస్తూ,సీపీఆర్‌ చేసే ప్రయత్నాలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. ట్విషా శర్మ మే 12న ఉదయం 7:20కి ఒంటరిగా మెట్లపైకి ఎక్కి టెర్రస్‌కి వెళ్లినట్ సీసీటీవీలో కనిపించింది.దాదాపు  గంట తర్వాత ఆ ముగ్గురు పైకి ట్విషా ఉన్న రూమ్‌లోకి వచ్చారు. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ (రిటైర్డ్ జడ్జ్) ఓ గదిలోకి వెళ్లి, కొద్దిసేపటికి బయటకు వచ్చి కిందికి వెళ్లినట్లు కూడా ఫుటేజ్‌లో కనిపించింది.

ట్విషా భర్త ప్రస్తుతం పోలీసుల నుంచి పరారీలో ఉన్నాడు. ట్విషా తల్లిదండ్రులు ఈ ముగ్గురి చర్యలు అనుమానాస్పదమని, వరకట్న వేధింపుల కారణంగా హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అని, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా అదే నిర్ధారిస్తున్నాయని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ట్విషా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దర్యాప్తుకు సిఫారసు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement