పింఛన్‌ కష్టాలు.. అత్తను మోసుకుంటూ 9కి.మీల నడక | Tribal Woman Carries 90-Year-Old Mother-in-Law To Bank | Sakshi
Sakshi News home page

పింఛన్‌ కష్టాలు.. అత్తను మోసుకుంటూ 9కి.మీల నడక

May 25 2026 4:02 AM | Updated on May 25 2026 5:57 AM

Tribal Woman Carries 90-Year-Old Mother-in-Law To Bank

అత్తను వీపుపై మోసుకుంటూ 9కి.మీల నడక

అంబికాపూర్‌: డిజిటల్‌ ఇండియా, ఇంటి వద్దకే సేవలు అంటూ ప్రభుత్వాలు పదేపదే ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ.. వాస్తవాలు మరోలా ఉన్నాయి. పింఛను ధ్రువీకరణ కోసం మారుమూల ప్రాంతాల్లోని వృద్ధులు, మంచాన పడిన వారు సంక్షేమ పథకాలను అందుకోవడానికి ఇప్పటికీ కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఇక నడవలేని వారిని కుటుంబ సభ్యులు కిలోమీటర్లకు కిలోమీటర్లు మోస్తున్నారు. అందుకు ఉదాహరణ ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతంలోని ఈ ఘటన. 

సుర్గుజా జిల్లాలోని మైన్‌పట్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 90 ఏళ్ల అత్తను వీపున కట్టుకొని మండుటెండలో అడవులు, వంకలు, లోయల్లో మోసుకుంటూ వస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో మారుమూల గ్రామీణ భారతంలో సంక్షేమ పథకాల పంపిణీపై ప్రశ్నలను లేవనెత్తుకుంది.  మైనపట్‌ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల సుఖ్మణియా బాయి అత్తకు 90 ఏళ్లు. ఆమెకు ప్రతినెలా వృద్ధాప్య పింఛను రూ.500 వస్తోంది. ఆ పింఛను విడుదల చేయడానికి లబ్ధిదారుల వేలిముద్ర లేదా గుర్తింపు ధ్రువీకరణ కావాలని బ్యాంకుకు నిబంధనలు పెట్టింది. 

దీంతో తన అత్తకు పింఛన్‌ ధ్రువీకరణ కోసం ఆమెను సుఖ్మణియా వీపుపైన మోస్తూ 9 కి.మీ. నడుస్తోంది. రవాణా సౌకర్యాలు లేకపోవడం, వాగులు, ఎగుడుదిగుడుగా అటవీ మార్గాల ద్వారా తాను దాటాల్సి వస్తోంది. గతంలో పెన్షన్‌ డబ్బును స్థానికంగానే పంపిణీ చేసేవారని, దాంతో సులభమయ్యేదని, ఇప్పుడక్కడ కేంద్రం లేకపోవడంతో ఇంతింత దూరాలు రావాల్సివస్తోందని స్థానికులు వాపోతున్నారు. 

స్థానికులు ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ వీడియో విధాన ప్రకటనలకు, గిరిజన ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అంతరానికి ప్రతీకగా నిలుస్తోంది.  అయితే, జనవరి నెలవరకు ఆమె ఇంటి వద్దే పెన్షన్‌ అందజేశామని, కేవైసీ ప్రక్రియలో లోపాల కారణంగా బ్యాంకుకు రావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. నాలుగు నెలల పెన్షన్‌ను ఒకేసారి ఇచ్చి పంపామని, వచ్చే నెల నుంచి, సుఖ్మణియా అత్తగారికి పెన్షన్‌ ఆమె ఇంటి దగ్గరే అందజేస్తామని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement