breaking news
Verification of Certification
-
పింఛన్ కష్టాలు.. అత్తను మోసుకుంటూ 9కి.మీల నడక
అంబికాపూర్: డిజిటల్ ఇండియా, ఇంటి వద్దకే సేవలు అంటూ ప్రభుత్వాలు పదేపదే ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ.. వాస్తవాలు మరోలా ఉన్నాయి. పింఛను ధ్రువీకరణ కోసం మారుమూల ప్రాంతాల్లోని వృద్ధులు, మంచాన పడిన వారు సంక్షేమ పథకాలను అందుకోవడానికి ఇప్పటికీ కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఇక నడవలేని వారిని కుటుంబ సభ్యులు కిలోమీటర్లకు కిలోమీటర్లు మోస్తున్నారు. అందుకు ఉదాహరణ ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతంలోని ఈ ఘటన. సుర్గుజా జిల్లాలోని మైన్‌పట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 90 ఏళ్ల అత్తను వీపున కట్టుకొని మండుటెండలో అడవులు, వంకలు, లోయల్లో మోసుకుంటూ వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మారుమూల గ్రామీణ భారతంలో సంక్షేమ పథకాల పంపిణీపై ప్రశ్నలను లేవనెత్తుకుంది. మైనపట్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల సుఖ్మణియా బాయి అత్తకు 90 ఏళ్లు. ఆమెకు ప్రతినెలా వృద్ధాప్య పింఛను రూ.500 వస్తోంది. ఆ పింఛను విడుదల చేయడానికి లబ్ధిదారుల వేలిముద్ర లేదా గుర్తింపు ధ్రువీకరణ కావాలని బ్యాంకుకు నిబంధనలు పెట్టింది. దీంతో తన అత్తకు పింఛన్ ధ్రువీకరణ కోసం ఆమెను సుఖ్మణియా వీపుపైన మోస్తూ 9 కి.మీ. నడుస్తోంది. రవాణా సౌకర్యాలు లేకపోవడం, వాగులు, ఎగుడుదిగుడుగా అటవీ మార్గాల ద్వారా తాను దాటాల్సి వస్తోంది. గతంలో పెన్షన్ డబ్బును స్థానికంగానే పంపిణీ చేసేవారని, దాంతో సులభమయ్యేదని, ఇప్పుడక్కడ కేంద్రం లేకపోవడంతో ఇంతింత దూరాలు రావాల్సివస్తోందని స్థానికులు వాపోతున్నారు. స్థానికులు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ వీడియో విధాన ప్రకటనలకు, గిరిజన ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అంతరానికి ప్రతీకగా నిలుస్తోంది. అయితే, జనవరి నెలవరకు ఆమె ఇంటి వద్దే పెన్షన్ అందజేశామని, కేవైసీ ప్రక్రియలో లోపాల కారణంగా బ్యాంకుకు రావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. నాలుగు నెలల పెన్షన్‌ను ఒకేసారి ఇచ్చి పంపామని, వచ్చే నెల నుంచి, సుఖ్మణియా అత్తగారికి పెన్షన్ ఆమె ఇంటి దగ్గరే అందజేస్తామని చెప్పారు. -
ఇక సులువుగా పోలీస్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇకపై పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికేషన్ (పీవీసీ), పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల (పీసీసీ)కు పోలీసు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్లు కావాలనుకున్న వారు నేరుగా ఆన్లైన్లో ఐ–వెరిఫై ద్వారా దరఖా స్తు చేసుకునే విధానాన్ని పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు. www.tspolice.gov.inను క్లిక్ చేసి పోలీస్ వెరిఫికేషన్–క్లియరెన్స్ ఆప్షన్స్ ఎంచుకుని.. నిబంధనలను ఫాలో అయితే సరిపోతుంది. పోలీసు వెరిఫికేషన్ సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ శాఖ సంబంధ కార్యాలయాలు, అందులో అపాయింట్ అయ్యే ప్రైవేటు ఉద్యోగులు. ఆయా కార్యాలయాల్లో ఇతర సేవల కోసం పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వలస వెళ్లే పౌరులకు ఇది అవసరం. ఒకసారి దరఖాస్తు పూర్తి చేశాక పోలీసుల పని మొదలవుతుంది. దీనిపై సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి. ఇవీ లాభాలు.. ► ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. ► డాక్యుమెంట్ల దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపులు సులభతరంగా మారుతాయి. ► ఆన్లైన్ దరఖాస్తుల్లోని ఫొటోల ఆధారంగా నేరచరిత కలిగిన వారిని సులువుగా గుర్తించే వీలుంది. ► దరఖాస్తుల పరిశీలనకు అదనపు మానవ వనరుల వినియోగం తగ్గింపు. ► దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకునే సదుపాయం దరఖాస్తుదారులకు కలుగుతుంది. -
8 నుంచి డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
విశాఖ రూరల్ : డీఎస్సీ-2014 ఉపాధ్యాయ నియామకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఈ నెల 8 నుంచి జనవరి 31వ తేదీ చేపడుతున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలన నిమిత్తం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వ్యక్తిగతంగా హాజరై నకలు కాపీలను దరఖాస్తుతో సమర్పించాలని సూచించారు. ఈ నెల 8 నుంచి జనవరి 31వ తేదీ వరకు ఆ దరఖాస్తులను అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు, ఇతర సమాచారం కోసం ఠీఠీఠీ.్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


