
వర్క్–రిటైర్‌మెంట్–వర్క్ కల్చర్‌కే జెన్–జెడ్ మిల్లీనియల్స్ ఓటు
ఈ గ్లోబల్ ట్రెండ్‌లో ముందువరుసలో భారతీయులు
జీవనశైలి అలవాట్లను మెరుగుపరుచుకునేందుకు
మూడు నెలల నుంచి ఏడాది దాకా మినీ రిటైర్‌మెంట్
హెచ్‌ఎస్‌బీసీ తాజా అధ్యయనంలో వెల్లడి
ఉద్యోగ విరమణ అనేది సాధారణంగా రిటైర్‌మెంట్ వయసు వచ్చినపుడు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, రిటైర్‌మెంట్ అనేది ఉద్యోగ, వృత్తిగత జీవితానికి ముగింపు కాదని ఓ విరామం మాత్రమేనని నవ యువతరం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో, ఇతరత్రా పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారతీయులు మల్టీ రిటైర్‌మెంట్లకు మొగ్గుచూపుతున్న ధోరణి క్రమంగా పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్
బహుళ–పదవీ విరమణలు తీసుకోవాలనే ధోరణి వివిధ తరాలకు చెందిన వారిలో పెరుగుతుండగా.. యువ, మధ్య వయసు్కల్లో అధికంగా ఉంటోంది. హెచ్‌ఎస్‌బీసీ సంస్థ తాజాగా నిర్వహించిన ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్–అఫ్లూయెన్స్ ఇన్వెస్టర్ స్నాప్‌షాట్–2025’అధ్యయనంలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
భారత్ సహా 12 దేశాల్లో 10 వేల మందికి పైగా సంపన్న వయోజనుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించారు. ఇందులో జెన్‌జెడ్–మిల్లీనియల్స్ తరానికి చెందిన వారు రిటైర్‌మెంట్‌ను ఉద్యోగ అంతం లేదా విరమణగా చూడకుండా... విరామాలతో మళ్లీ కొనసాగించే పనిగా సూత్రీకరిస్తుండటం గమనార్హం. ఇలా తీసుకునే రిటైర్‌మెంట్‌లు మూడునెలల నుంచి ఏడాది దాకా ఉంటున్నాయి.
ముందు వరుసలో భారతీయులు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ ధోరణిలో భారతీయులు ముందువరుసలో ఉండటం విశేషం. అయితే సంపన్న వర్గాల వారే మల్టీ–రిటైర్మెంట్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా పని చేసేవారు 55–60 ఏళ్ల వయసు వచ్చే దాకా ఆగకుండా నలభైల్లోనే ఈ రిటైర్‌మెంట్లు తీసుకుంటున్నారు. వర్క్–రిటైర్‌మెంట్–వర్క్ కల్చర్‌కే జెన్–జెడ్ (1997–2012 మధ్య జన్మించిన వారు), మిల్లీనియల్స్ (1981–96 మధ్య పుట్టిన వారు) ఓటు వేస్తున్నారు.
డిజిటల్ మాధ్యమాల ప్రభావాల మధ్య పుట్టి పెరిగిన వారు కాబట్టి జెన్–జెడ్‌ను డిజిటల్ నేటివ్స్‌గానూ పరిగణిస్తున్నారు. జీవనశైలి, అభిరుచులు, అలవాట్లకు తగ్గట్టుగా మూడు నెలల నుంచి ఏడాది దాకా మినీ రిటైర్‌మెంట్ తీసుకుంటున్న వారే అధికంగా ఉంటున్నారు.
ఇలా కెరీర్‌లో బ్రేక్ తీసుకోవడం ద్వారా తమ జీవనశైలిని మెరుగుపరుచుకునేలా రీచార్జ్ కావడంతోపాటు తమ అభిరుచులను మరింత గాఢంగా ఆస్వాదించేందుకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు. ఇలాంటి బ్రేక్‌ల వల్ల తమ వృత్తిగత జీవితం, కెరీర్, లైఫ్‌స్టైల్ మరింత మెరుగవుతుందనే భావనలో వారున్నారు.
వర్క్–రిటైర్‌మెంట్–వర్క్ అంటే...
మొదట కొన్నేళ్లపాటు ఉద్యోగం, వ్యాపారం ఇతర వ్యాపకాలు చేసి 40–45 ఏళ్ల మధ్యవయసులో రిటైర్‌మెంట్ తీసుకుంటారు. విరామం అనేది అది కొన్ని నెలల నుంచి సంవత్సరం దాకా ఉండొచ్చు. తర్వాత మళ్లీ తిరిగి మరేదైనా ఉద్యోగం, వ్యాపారం వంటి దాన్ని ఎంచుకుంటారు.
కొత్త బాటలో..
బహుళ పదవీ విరమణలను జీవనశైలి మెరుగు కోసం తీసుకుంటున్న వాటిగానే భావించాలి తప్ప సంప్రదాయ కెరీర్ విరామంగా కాదు. బహుళ–పదవీ విరమణలతో కొంతమంది తమ సంపదను కూడబెట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. తమ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా కొత్త దిశలను ఎంచుకుంటున్నారు. –హెచ్‌ఎస్‌బీసీ అధ్యయనకర్తలు
సర్వేలోని ముఖ్యాంశాలు..
» సగటున 44 ఏళ్ల వయసులో తొలి మినీ రిటైర్‌మెంట్ తీసుకోవాలనే భావనలో భారతీయులు ఉంటే.. ప్రపంచస్థాయి సగటు 47 ఏళ్లుగా ఉంది.
» తమ జీవిత కాలంలో ఇలాంటి రిటైర్‌మెంట్ కనీసం ఒకటి తీసుకోవాలని భావిస్తున్న సంపన్న భారతీయులు 48శాతం.
» ఇలాంటి విరామాలు 2, 3 తీసుకోవాలనే ఆలోచనతో ఉన్న భారతీయులు 44 శాతం. వీరిలో కొందరు ఆరేళ్లకోసారి బ్రేక్ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
» మొత్తంగా 85 శాతం మంది మల్టీ రిటైర్‌మెంట్లకు సై అంటున్నారు. మల్టీ రిటైర్‌మెంట్‌తో తమ జీవనశైలిలో మంచి మార్పును గమనించినట్టు చెబుతున్నారు.
» కనీసం ఒక చిన్న పదవీ విరమణ తీసుకున్న వారిలో 87% మంది తమ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందన్నారు.
» పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కూడిన కుటుంబసభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి 34 శాతం ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు.
» బహుళ రిటైర్‌మెంట్లతో శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నవారు 31 శాతం.
నిర్దేశిత సెలవుల పరిమితులు లేకుండా ప్రయాణించడం, కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేíÙంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటామన్న వారు 30 శాతం.
» ఇది తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు, వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుందన్న వారు 28 శాతం.
» కెరీర్ లక్ష్యాలను తిరిగి అంచనా వేయడానికి పని నుంచి విరామం తీసుకోవడం కొత్త అవకాశాలకు దారితీస్తుందని అంచనా వేస్తున్న వారు 25 శాతం.