గురుగ్రామ్: గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం జరిగిన ప్రేమ వివాహం చివరికి విషాదంగా మిగిలింది. నర్సు హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో భర్తే.. భార్యకు అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది, రేడియాలజిస్ట్ అరుణ్ శర్మ, నర్సుగా పని చేస్తున్న కాజల్ ఓ నర్సింగ్ హోమ్‌లో సహోద్యోగులుగా పరిచయమయ్యారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. గత ఏడాది నవంబర్‌లో వారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే, నాలుగు నెలలు తిరక్కుండానే వరకట్నం కోసం అరుణ్ ఆమెను హత్య చేయడంతో వారి బంధం విషాదాంతమైంది.
వివాహం జరిగిన కొద్ది రోజులకే చిన్న చిన్న విషయాలకే అరుణ్ తన భార్యపై చేయి చేసుకునేవాడు. డబ్బు తేవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని.. వరకట్నం కోసం వేధిండని కాజల్ సోదరుడు పేర్కొన్నాడు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 4న ఈ దంపతులు గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులో ఉన్న కాజల్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చారు. దాదాపు రెండు వారాల తర్వాత మార్చి 17న మద్యం మత్తులో ఉన్న అరుణ్.. కాజల్‌పై దాడి చేశాడు.
మరుసటి రోజు ఉదయం, మాట్లాడాలని చెప్పి అరుణ్.. కాజల్‌ను కిందకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఈ కొత్త దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కాజల్ స్పృహతప్పి పడిపోయింది, ఆమె ముక్కు నుంచి రక్తం కారడం గమనించారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే సరికి పరిస్థితి చేయిజారిపోయింది; ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
టాయిలెట్‌లో తమకు ఒక సిరంజి దొరికిందని.. అరుణ్ ఆమెకు విషం ఇచ్చి ఉంటాడని కాజల్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాజల్‌కు అరుణ్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ పరిధిలోని బెహ్తా హాజీపూర్‌కు చెందిన అరుణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి గతంలో మాదకద్రవ్యాలు వాడే అలవాటు ఉన్నట్లు సమాచారం.


