గజరాజుల జలకాలాటలో మహిళ జలసమాధి | Tourist Killed After Elephant Falls On Her During Clash At Karnataka Wildlife Centre, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

గజరాజుల జలకాలాటలో మహిళ జలసమాధి

May 18 2026 4:05 PM | Updated on May 19 2026 5:11 AM

 tourist trampled under two fighting elephants at karnataka

కర్ణాటకలో దుబారె గజ శిబిరంలో విషాద ఘటన 

యశవంతపుర: గజరాజుల జలకాలాట ఒక కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఏనుగులను దగ్గరగా చూడాలని ముచ్చటపడిన ఓ పర్యాటకురాలు అనూహ్యంగా ఏనుగు కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని దుబారెలో ఉన్న అటవీశాఖ ఏనుగుల శిబిరంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. 

పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొనే ఏనుగులు కావేరీ నదీతీరం వెంట జలకాలాడుతున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. తమిళనాడు నుంచి వచ్చిన 33 ఏళ్ల తులసి అనే మహిళ సైతం తన కుమార్తె, భర్తతో కలిసి నది ఒడ్డున ఏనుగులను చూసేందుకు అత్యంత సమీపంగా వెళ్లారు. అదే సమయంలో కంజన్, మార్తాండ అనే ఏనుగులు స్వల్పంగా ఘర్షణపడ్డాయి. 

ఈ సమయంలో కోపంతో కంజన్‌ అనే ఏనుగు మార్తాండ అనే ఏనుగును తోసేసింది. దీంతో అది బురదతో నిండిన ఒడ్డులో పడిపోయింది. ఒరిగిపోతూ అది అక్కడే ఉన్న తులసి మీద పడింది. దీంతో ఆమె బురదలో కూరుకుపోయింది. ఇది చూసిన మావటి కంజన్‌ను దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. అది కిందపడిపోయిన ఏనుగును పదేపదే నెట్టడంతో అది లేవలేక అలాగే బురదలో ఉండిపోయింది. దీంతో ఏనుగు బరువుకు దాని కింద ఇరుక్కుని మహిళ మట్టిలో కూరుకుపోయి ప్రాణాలుకోల్పోయారు. 

ఎట్టకేలకు దాడిచేసిన ఏనుగును మావటి దూరంగా తీసుకెళ్లాక కిందపడిన ఏనుగు పైకి లేచింది. వెంటనే తోటి పర్యాటకులు తులసిని సమీప ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఏనుగుల ఘర్షణ, తులసి పడిపోవడం, ఆమెపై ఏనుగు పడటం అన్నీ సమీపంలోని పర్యాటకుల స్మార్ట్‌ఫోన్లలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో మహిళ భర్త, కూతురు అక్కడే ఉన్నా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భార్యను ఎలాగైనా ఏనుగు కింద నుంచి లాగేందుకు భర్త ఎంతగానో శ్రమించడం వీడియోలో రికార్డయింది. అప్పటిదాకా ఏనుగుల ఘీంకారాలు, పర్యాటకులతో ఆనందంతో సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. 

భయంతో జనమంతా దూరంగా పారిపోయారు. ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. వన్యప్రాణులకు ముఖ్యంగా ఏనుగులను కనీసం 100 అడుగుల దూరం నుంచే పర్యాటకులు చూడాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె సూచించారు. ఏనుగును తాకడం, దగ్గరగా ఉండి ఫొటోలను తీసుకోవడం చేయరాదని హెచ్చరించారు. పర్యాటకులు అరటిపండ్లు, బెల్లం, చెరకు గడలు వంటివి ఏనుగులకు చేతితో అందించడంపై నిషేధం విధిస్తామని తెలిపారు. వన్యప్రాణులుండే పర్యాటక ప్రదేశాల్లో అమలుచేయాల్సిన ప్రామాణిక కార్యాచరణ ప్రణాళిక(ఎస్‌ఓపీ)ని అధికారులు తప్పకుండా అమలుచేయాలని ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్‌ వార్డెన్ల ప్రధాన కార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీచేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement