సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు! | TN CM Vijays Office Takes Shape Top IAS Officers Appointed | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు!

May 11 2026 8:59 AM | Updated on May 11 2026 9:55 AM

TN CM Vijays Office Takes Shape Top IAS Officers Appointed

తిరువనంతపురం: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్ అప్పుడే పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, తన ‘కొత్త శకం’ అజెండాను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను తన అధికారిక కార్యదర్శులుగా నియమించుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి కార్యదర్శులుగా..
ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.సెంథిల్ కుమార్‌ను బదిలీ చేసి, ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి-కార్యదర్శి వన్‌గా నియమించారు. అలాగే మరో సీనియర్ అధికారిణి జి.లక్ష్మీప్రియను ముఖ్యమంత్రి కార్యాలయానికి కార్యదర్శి టుగా బదిలీ చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తర్వాత సీఎం ఆఫీస్ కార్యకలాపాలను పటిష్టం చేయడంలో ఇవే తొలి అడుగులు.

120 సీట్లతో బలం.. సంక్షేమంపై గురి
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే)పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పటికీ.. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్‌ మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే, సీఎం విజయ్ తన తొలి ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన అనే మూడు ప్రధాన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు ప్రకటించారు.

ఖజానా ఖాళీ.. పాలనలో పారదర్శకత
‘నేను రాజ కుటుంబం నుంచి రాలేదు. నేను మీ ఇంట్లో కొడుకుని, తమ్ముడిని, అన్నను’ అంటూ విజయ్ తన ప్రసంగంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, నిజమైన సామాజిక న్యాయంతో కొత్త శకానికి నాంది పలుకుతున్నానని ఉద్ఘాటించారు. గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టి, ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని, ప్రభుత్వ నిర్ణయాలన్నీ అత్యంత పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఇవేం బదిలీలు సామీ?.. కొత్త ప్రభుత్వం రాకముందే షాక్!

Advertisement
 
Advertisement
Advertisement