ఇవేం బదిలీలు సామీ?.. కొత్త ప్రభుత్వం రాకముందే షాక్! | Massive Transfer Row in Kerala 350 Officials Moved Ahead of New Govt | Sakshi
Sakshi News home page

ఇవేం బదిలీలు సామీ?.. కొత్త ప్రభుత్వం రాకముందే షాక్!

May 11 2026 8:12 AM | Updated on May 11 2026 9:45 AM

Massive Transfer Row in Kerala 350 Officials Moved Ahead of New Govt

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర పరిపాలనా విభాగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారికంగా ఇంకా పగ్గాలు చేపట్టకముందే, ఏకంగా 350కి పైగా ప్రభుత్వ అధికారులను మూకుమ్మడిగా బదిలీ చేయడం కలకలం రేపుతోంది. ఒకవైపు ఉన్నతాధికారులు ఇవి కేవలం ‘పరిపాలనా సౌలభ్యం’ కోసమే అని సమర్థిస్తుండగా, మరోవైపు ఇందులో విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.

వివిధ శాఖల్లో ప్రక్షాళన
రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక శాఖల్లో ఈ బదిలీల ప్రక్రియ అత్యంత వేగంగా జరిగింది. ముఖ్యంగా సహకార, రిజిస్ట్రేషన్ శాఖలో 52 మందిని, రెవెన్యూ విభాగంలో 50 మంది అధికారులను మార్చేశారు. వీటితో పాటు ఆడిట్ (31), నీటిపారుదల (35), సాంకేతిక విద్య (34), గణాంకాల శాఖ (22), భూ కమతాల కమిషనరేట్ (20), జీఎస్టీ (14), అలాగే వైద్య, ఆరోగ్య, స్థానిక స్వపరిపాలనా శాఖల్లోనూ భారీ ఎత్తున స్థానచలనాలు జరిగాయి. ఆన్‌లైన్ బదిలీలు కచ్చితంగా అమలు చేయాల్సిన శాఖల్లో సైతం, నేరుగా ఉన్నతాధికారుల నుంచే ఉత్తర్వులు రావడం గమనార్హం.

రాజకీయ జోక్యం ఉందా?
కొత్త మంత్రులు ఇంకా బాధ్యతలు స్వీకరించకముందే ఈ స్థాయిలో మార్పులు జరగడం వెనుక ప్రభుత్వ అనుకూల ఉద్యోగ సంఘాల  హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలమైన పోస్టింగులు దక్కించుకునేందుకే పక్కా ప్రణాళికతో ఈ బదిలీల పర్వానికి తెరతీశారని ‘సెటో’ చైర్మన్ చవర జయకుమార్, ఎన్జీఓ యూనియన్ నేత ఎం.వి. శశిధరన్ తీవ్రంగా మండిపడ్డారు. అయితే, ఎన్జీఓ అసోసియేషన్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. పదేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన వారినే బదిలీ చేస్తున్నామని, ఇది కేవలం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేసింది.

భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు
ఈ మూకుమ్మడి బదిలీలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పలు ఉద్యోగ సంఘాలు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సోమవారం అలప్పుజ కలెక్టరేట్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని జాయింట్ కౌన్సిల్ వంటి వామపక్ష అనుబంధ సంఘాలు నిర్ణయించాయి. తాము సాధారణ బదిలీలకు వ్యతిరేకం కాదని, కానీ రాజకీయ ప్రేరేపిత, అక్రమ బదిలీలను మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జాయింట్ కౌన్సిల్ నేత హరిదాస్ స్పష్టం చేశారు. ఈ అనూహ్య పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మరింత ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ

Advertisement
 
Advertisement
Advertisement