బస్సును అడ్డుకున్న ఆగంతకులు.. జవాన్‌ తెగువ

Thugs Attack On Bus At Odisha - Sakshi

బస్సును అడ్డుకున్న ఆగంతకులు 

తలపై తుపాకీ పెట్టి డ్రైవర్‌కు బెదిరింపు 

జవాన్‌ సాహసంతో పరారైన దుండగులు 

భువనేశ్వర్‌: ఓ జవాన్‌ తెగువ.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి ప్రాణాలను కాపాడగలిగింది. ఒడిశాలోని కియోంజర్‌ 2వ ప్రత్యేక భద్రతా దళానికి చెందిన జవాన్‌ హిమాంశు శేఖర పాత్రో కటక్‌ నుంచి భువనేశ్వర్‌కి బస్సులో ఆదివారం ఉదయం బయలుదేరాడు. డెంకనాల్‌ జిల్లా సమీపంలోకి రాగానే కొంతమంది దుండగులు బస్సుని ఆపారు. డ్రైవర్‌ తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. ప్రయాణికులు భయపడుతుండగా బస్సులో ఉన్న జవాన్‌ సాహసించి ఒక్కసారిగా దుండగుల వైపు దూకాడు. వారి చేతిలోని తుపాకీని స్వాధీనం చేసుకుని వారికే గురిపెట్టాడు. దీంతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకులు ఎవరు, ఎందుకు దాడి చేశారనే దానిపై విచారిస్తున్నట్లు డెంకనాల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ జగ్‌మోహన్‌ మీనా తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.  చదవండి: (ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు)


ఘటనాస్థలంలో నిలిచిపోయిన బస్సు  
 

జవాన్‌కు డీజీపీ సత్కారం.. 
దుండగుల బారి నుంచి ప్రయాణికులను కాపాడిన జవాన్‌ పాత్రోని ఒడిశా డీజీపీ అభయ్‌ విందుకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జవాన్‌కు డీజీపీ ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. హిమాంశు చాలా ధైర్యవంతుడని, సాదాసీదా వ్యక్తిత్వంతో విధి నిర్వహణలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని డీజీపీ ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో స్పందించి, బస్సు ప్రయాణికుల ప్రాణాలను రక్షించడంలో జవాన్‌ అంకితభావం స్ఫూర్తిదాయకమని డీజీపీ అన్నారు.

దుండగుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top