మానవత్వంతో దాహార్తిని తీర్చిన ప్రయాణికులు
మహారాష్ట్రలో ఘటన
ఒక రోజంతా తిండిలేకుండా ఉండగలవేమోగానీ ఒకపూట అందులోనూ ప్రచండ ఎండల్లో ఆరుబయట చుక్కనీరులేకుండా తిరగడం అస్సలు సాధ్యంకాని పని. వేసవికాలంలో నోరులేని మూగజీవాల సంగతి చెప్పనక్కర్లేదు. అటవీప్రాంతాల్లోని వానరాలు, కొండముచ్చుల దాహార్తి ఇక ఎవరికీ పట్టదు. కొండ మీద స్వేచ్ఛగా తిరిగే కొండముచ్చులు మండే ఎండల ధాటికి తాగడానికి నీరులేక రహదారి సమీపానికి వచ్చాయి.
ఒక కొండముచ్చు ప్రాణాలకు తెగించి రోడ్డుకు అడ్డంగా కూర్చుని దప్పిక తీర్చమని అరి్థంచింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో జరిగింది. పుసాద్ పట్టణం సమీపంలోని ఖండాలా ఘాట్ గుండా గురువారం మధ్యాహ్నం ప్రయాణికులతో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు ఖండాలా ఘాట్ అటవీప్రాంతం గుండా వెళ్తుండగా హఠాత్తుగా ఒక కొంచముచ్చు రోడ్డు మధ్యలోకి వచ్చి ఆగింది.
డ్రైవర్ వెంటనే బస్సును ఆపి కిందకు దిగొచ్చి ఎంతలా అదిలించినా అది అస్సలు అక్కడి నుంచి కదల్లేదు. చుక్క నీరులేక దప్పికతో ఉందని దానిని తేరిపారా చూశాక డ్రైవర్‌కు అర్థమైంది. వెంటనే నీళ్లసీసాతో దానికి నీళ్లు పట్టాడు. ఆబగా అది నీళ్లు తాగడం చూసి సమీపంలోని డజనుపైగా కొండముచ్చులు సైతం రోడ్డు మీద కొచ్చి ప్రయాణికుల వైపు నిస్సహాయంగా చూడడం మొదలెట్టాయి. ఇదంతా గమనించిన ప్రయాణికుల మనసు చివుక్కుమంది.
వెంటనే ప్రతి ఒక్క ప్రయాణికుడు తమ వెంట తెచ్చుకున్న నీళ్లసీసాలతో కొండముచ్చులకు నీళ్లు పట్టే ప్రయత్నంచేశారు. ఈ హృదయవిదారక దృశ్యాలను లతా శ్రీవాస్ అనే ప్రయాణికురాలు వీడియో తీయగా ఇప్పుడది వైరల్‌గా మారింది. అటవీప్రాంతంలో మధ్యాహ్నం ఎండకు తాగునీటి కోసం వెతికి వెతికి అవన్నీ నీరసించిపోయి కన్పించాయని ప్రయాణికులు తెలిపారు. కరువు కోరల్లో చిక్కుకున్న విదర్భ ప్రాంతంలో జనం నీళ్లకోసం ఎంతగానో శ్రమిస్తుంటే ఇక అటవీప్రాంతంలోని మూగజీవుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మండు వేసవిలో అటవీప్రాంతంలోని కోతుల కోసం అటవీశాఖ సిబ్బంది కొన్ని చోట్ల కృత్రిమ నీటికుంటలను ఏర్పాటుచేస్తున్నా అవి ఎండలకు చుక్కనీరులేకుండా పోతున్నాయి. ఖంఢాలా ఘాట్‌లో కోతులకు కనీసం నీటిసదుపాయం కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సోషల్‌మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వడగాల్పుల వేసవిలో ఇళ్లలో ఉండే జనమే తిప్పలుపడుతుంటే ఇక కొండల్లో ఉండే కోతుల పరిస్థితి ఏంటి?. వన్యప్రాణాల గొంతులు పిడతగట్టుకుపోతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మారుతున్న వాతావరణ పరిస్థితుల ధాటికి వర్షాలు బాగా తగ్గిపోయి, పండ్ల చెట్లు నశించి అడవుల్లో వన్యప్రాణులకు సరైన తిండి కూడా దొరకట్లేదు’’అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశాడు.
– ముంబై


