టెట్రా ప్యాక్‌ల్లో మద్యం.. మోసపూరితం | Tetra-packaging of alcohol as very deceptive, says Supreme Court Of India | Sakshi
Sakshi News home page

టెట్రా ప్యాక్‌ల్లో మద్యం.. మోసపూరితం

May 21 2026 1:16 AM | Updated on May 21 2026 1:16 AM

Tetra-packaging of alcohol as very deceptive, says Supreme Court Of India

పండ్ల రసాల ప్యాకెట్లను పోలి ఉండటం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం  

మైనర్లు సులభంగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందన్న పిటిషనర్‌  

‘బాట్లింగ్‌’ అనే పదానికి ఏకీకృత నిర్వచనం ఇవ్వాలని వినతి 

కేంద్రం సహా రాష్ట్రాల ఎక్సైజ్‌ శాఖలకు నోటీసులు జారీ చేసిన సీజేఐ ధర్మాసనం

సాక్షి, న్యూఢిల్లీ: టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల వంటి ‘గుర్తించలేని ప్యాకేజింగ్‌’లో మద్యం విక్రయాలు సాగిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర ఇతర భాగస్వామ్య పక్షాలను ఆదేశించింది. కేంద్రంసహా అన్ని రాష్ట్రాల ఎక్సైజ్‌ శాఖలకు నోటీసులు జారీ చేసింది.

 ‘డ్రంకెన్‌ డ్రైవింగ్‌ వ్యతిరేక కమ్యూనిటీ’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని, టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల మద్యం అమ్మకాలను నిషేధించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున అడ్వొకేట్‌ విపిన్‌ నాయర్‌ వాదనలు వినిపించారు. ఎక్సైజ్‌ విధానం కింద ‘సీసా’ అనే పదానికి నిర్వచనం అస్పష్టంగా ఉందని, దీనిపై కొంత ప్రామాణీకరణ జరగాలని చెప్పారు. 

ఆకుపచ్చ ఆపిల్‌ ఫోటోలు ఉన్న టెట్రా ప్యాక్‌ల్లో మద్యం ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం నిజంగా మోసపూరితమేనని ధర్మాసనం పేర్కొంది. టెట్రా ప్యాక్‌ చూసి వినియోగదారులు పొరబడుతున్నారని, పైన ఆపిల్‌ ఫోటో, లోపల వోడ్కా ఉంటోందని విపిన్‌ నాయర్‌ వెల్లడించారు. పౌరుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని తేల్చిచెప్పారు. ‘‘పొగాకు ప్యాకెట్లపై ఉన్నట్లుగా టెట్రా ప్యాక్‌లపై ఎలాంటి హెచ్చరిక గుర్తులు లేవు. ఇవి పండ్ల రసాల ప్యాకెట్ల మాదిరిగానే ఉంటాయి. లోపల మద్యం నింపుతున్నారు. 

మిరపకాయ, మామిడి వోడ్కాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పబ్లిక్‌ ప్రదేశాల్లో, వాహనాలు నడుపుతూ సులభంగా మద్యం తాగే అవకాశం కలుగుతోంది. మైనర్లు వీటికి త్వరగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రాల సరిహద్దులు దాటించి స్మగ్లింగ్‌ చేయడం కూడా సులభంగా మారుతోంది. ఈ తరహా విక్రయాలను నిషేధించేలా ఒక విధానాన్ని తీసుకురావాలి. 

‘బాట్లింగ్‌’ అంటే కేవలం గాజు సీసాలు లేదా పారదర్శక కంటైనర్లు మాత్రమే అన్నట్లుగా ఏకీకృత నిర్వచనం ఇవ్వాలి. అంతేకాకుండా ప్లాస్టిక్‌ సాచెట్లు, పెట్‌ బాటిళ్లు, టెట్రా ప్యాక్‌ల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. వీటిని రీసైకిల్‌ చేయడం దాదాపు అసాధ్యం. ఆదాయం పెంచుకోవడానికే వాటిని ప్రోత్సహిస్తున్నారు. ప్రమాదకరమైన ప్యాకేజింగ్‌లో మద్యం అమ్మకాలను నిషేధించడం ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అత్యవసరం’’ అని అని విపిన్‌ నాయర్‌ పేర్కొన్నారు.  

ప్రజలను తప్పుదోవ పట్టించడమే: ధర్మాసనం  
పిటిషనర్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పండ్ల రసాల ప్యాకెట్లను పోలి ఉండే టెట్రా ప్యాక్‌ల్లో విరివిగా మద్యం విక్రయించడం అత్యంత మోసపూరితమైన చర్య అని వ్యాఖ్యానించింది. ఇలాంటి విక్రయాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అభిప్రాయపడింది. గతంలో ఓ ట్రేడ్‌ మార్క్‌ వివాదానికి సంబంధించిన విచారణలోనూ టెట్రా ప్యాక్‌ల్లో మద్యం అమ్మకాలపై తాము అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement