30 ఎల్‌ఎంటీ బాయిల్డ్‌ రైస్‌ సేకరించండి | Telangana seeks procurement of 30 LMT boiled rice | Sakshi
Sakshi News home page

30 ఎల్‌ఎంటీ బాయిల్డ్‌ రైస్‌ సేకరించండి

Apr 18 2026 4:38 AM | Updated on Apr 18 2026 4:38 AM

Telangana seeks procurement of 30 LMT boiled rice

కేంద్ర మంత్రి ప్రల్హాద్‌ జోషీకి వినతిపత్రం అందచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌

5 శాతం నూకతో బాయిల్డ్‌ రైస్‌ సరఫరాకు సిద్ధం

పాత బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి.. పోషకాహార బియ్యం పంపిణీని పునఃప్రారంభించండి  

కేంద్ర మంత్రి ప్రల్హాద్‌ జోషికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌ వినతి  

సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్‌ రైస్‌ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్డ్‌ రైస్‌ మిల్లింగ్‌కు అనుకూలమని కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని వివరించారు.

ఢిల్లీలో జోషిని ఆయన నివాసంలో సీఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్‌ రైస్‌కు భారీ డిమాండ్‌ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్రం సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించిమొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్‌ రైస్‌ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్‌ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్‌ కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్‌ రైస్‌ సరఫరాకు సంబంధించి సీఎం, మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. 

బకాయిలు విడుదల చేయండి 
2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రల్హాద్‌ జోషికి రేవంత్, ఉత్తమ్‌ విన్నవించారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.

పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గానూ పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్‌ల పరిధిలో పంపిణీ చేసేవారని... ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునఃప్రారంభించాలని సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్‌ అద్వైత్‌ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.  

కేంద్ర మంత్రి సానుకూలం: ఉత్తమ్‌ 
ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి 30లక్షల బాయిల్డ్‌ రైస్, 5లక్షల మెట్రిక టన్నుల రారైస్‌ సేకరణకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భేటీ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో 1.48కోట్ల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరుగుతోందని, ఇందులో 90లక్షల మెట్రిక టన్నుల మేర కొనుగోలు చేయనున్నట్లు వివరించామన్నారు. కాగా, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వర్ధంతి సందర్భంగా.. ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాధాకృష్ణన్‌ చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement