నీట్‌ రద్దుకు.. ఎందాకైనా!

Tamilnadu: Stalin Government Fight Against NEET EntranceTest  Exam - Sakshi

వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ పరీక్ష రద్దు కోసం ఇక చట్టపరంగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ వ్యవహారంలో అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని, తమిళ విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఎంత వరకైనా వెళ్తామని సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు.  

సాక్షి, చెన్నై(తమిళనాడు): నీట్‌ రద్దు కోసం డీఎంకే ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇక ఈ పరీక్షకు వ్యతిరేకంగా గత ఏడాది అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌.. రాష్ట్రపతికి పంపించకుండా తుంగలో తొక్కడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశానికి అసెంబ్లీ వేదికగా రెండు రోజుల క్రితం సీఎం ఎంకే స్టాలిన్‌ పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో నామక్కల్‌ కవింజర్‌ మాళిగైలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు.  

గవర్నర్‌ తీరుపై.. 
అసెంబ్లీ తీర్మానాన్ని తుంగలో తొక్కిన గవర్నర్‌ తీరును తీవ్రంగా పరిగణిస్తూ నీట్‌కు వ్యతిరేకంగా ఇక, చట్టపరమైన చర్యలకు ఈ సమావేశంలో తీర్మానించారు. సీఎం స్టాలిన్‌ సమావేశంలో మాట్లాడుతూ.. తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించకుండా గవర్నర్‌ వ్యవహరించడం అసెంబ్లీ హక్కుల్ని కాలరాసినట్టు కాదా..? అని ప్రశ్నించారు.  

వృథా అవుతున్న.. విద్యార్థుల శ్రమ  
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్‌ మీడియాకు వివరించారు. నీట్‌ శిక్షణ కేవలం సంపన్నులకే పరిమితం అవుతోందన్నారు. 12 ఏళ్లు రేయింబవళ్లు విద్యార్థులు పడ్డ శ్రమ, నేర్చుకున్న పాఠాలు నీట్‌ కారణంగా వృథా అవుతున్నాయని ధ్వజమెత్తారు. ఇది వరకు నీట్‌ విషయంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసినప్పుడు తమ రాష్ట్రంలో(ఒడిశ్శా) కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని,

అయితే, తానేమీ చేయలేని పరిస్థితిగా పేర్కొన్నట్టు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని నీట్‌కు అనుకూలంగా స్పందించిన బిజేపి ప్రతినిధి దృష్టి ఈ సమావేశంలో తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. అనుమతి రాగానే, రాష్ట్రంలోని ఎంపీలు, శాసన సభా పక్షపార్టీల ప్రతినిధులు అందరూ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ఒత్తిడి తీసుకు రానున్నట్లు వెల్లడించారు.  

13 పార్టీల ప్రతినిధుల హాజరు 
సీఎం ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీనియర్‌ మంత్రులు దురై మురుగన్, పొన్ముడి, కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత సెల్వ పెరుంతొగై,  అన్నాడీఎంకే తరపున మాజీ మంత్రి, ఎమ్మెల్యే విజయ భాస్కర్, పీఎంకే తరపున ఆపార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీకే మణి,  బీజేపీ తరపున  ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, మనిద నేయ మక్కల్‌ కట్చి తరపున ఎమ్మెల్యే జవహరుల్లా, తమిళర్‌ వాల్వురిమై కట్చి తరపున ఎమ్మెల్యే వేల్‌ మురుగన్‌తో పాటుగా ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ తదితర 13 పార్టీల శాసన సభ ప్రతినిధులు హాజరయ్యారు.

గంట పాటుగా సాగి న ఈ సమావేశంలో నీట్‌ గురించి అన్ని పార్టీల అభిప్రాయాల్ని సీఎం స్టాలిన్‌ స్వీకరించారు. అయితే, బీజేపీ తరపున  మాత్రం నీట్‌కు అనుకూలంగా కేంద్రం చర్యలను సమర్థించడం గమనార్హం. అలాగే, సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. ఇక, మిగిలిన 12 పార్టీల ప్రతినిధులు నీట్‌ వద్దే వద్దు అని, అడ్డుకుని తీరుదామని, కేంద్రం చర్యలకు ముగింపు పలుకుదామని స్పష్టం చేశాయి.  

చదవండి: నవ దంపతులపై హత్యాయత్నం 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top