తమిళనాడు: భారీ వర్షాలతో అతలాకుతలం.. నీట మునిగిన చెన్నై.. మరో నాలుగురోజులపాటు

Tamil Nadu: Parts Of Chennai Under Water After Heavy Rain - Sakshi

సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల.. తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గురువారం కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మరో నాలుగు రోజులపాటు వర్ష ప్రభావం ఉండడంతో అధికార యంత్రాగం అప్రమత్తం అయ్యింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి పరిధిలో 14 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక అర్ధరాత్రి భారీ వర్షంతో చెన్నై జలమయం అయ్యింది. 

రాజధాని చెన్నైలోని పలు కాలనీలు జలమయంకాగా, చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. ఉత్తర చెన్నైలోని పులియాంతోప్‌లో మోకాళ్ల లోతులో నీళ్లు చేరి.. పలు వాహనాలు నాశనం అయ్యాయి. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇక చెన్నైతో పాటు వెల్లూరు, తిరువళ్లూరు, కళ్లకురిచి, సేలం, రాణిపేట, తిరువణ్ణమలై జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 

శుక్రవారం ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవారణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.  మొత్తం ఐదువేలకు పైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా.. అందులో 169 శిబిరాలు చెన్నైలోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 2 వేల మందికి పైగా సిబ్బందిని మోహరించారు అధికారులు. 

ఉన్నట్లుండి మారిన వాతావరణం
గురువారం ఉదయాన్నే భానుడు కాసేపు కనిపించినా.. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారింది. నగరం అంతా మేఘావృతమైంది. సాయంత్రం అక్కడక్కడ భారీ  వర్షం పడింది. ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత చెన్నైలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. డెల్టా రీజియన్‌లోని చెన్నై, చెంగల్‌పట్టు, విల్లుపురం, కళ్లకురిచి, ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం తీరాన్ని సమీపించే క్రమంలో  శనివారం చెన్నైలో వరుణుడు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో సముద్ర తీర జిల్లాలలో 4 రోజులు వర్షాలు కురవనున్నాయి. 

ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఆయా జిల్లాల యంత్రాంగాలు ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. ఇక సముద్రంలో సుడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, వేటకు దూరంగా ఉండాలని జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వాయుగుండం హెచ్చరికలతో రాష్ట్రంలోని పలు సముద్ర తీర జిల్లాలలోని జాలర్లు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలవేర్కాడు తీరంలో ఒకటో నెంబరు తుపాన్‌ ప్రమాద హెచ్చరిక సూచికను ఎగుర వేశారు.

ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top