తమిళనాడులో నిన్న సెమ్మలై.. నేడు ధనపాల్‌ | Tamil Nadu dhanapal Resign To AIADMK | Sakshi
Sakshi News home page

తమిళనాడులో నిన్న సెమ్మలై.. నేడు ధనపాల్‌

May 22 2026 1:05 PM | Updated on May 22 2026 7:17 PM

Tamil Nadu dhanapal Resign To AIADMK

సాక్షి, చెన్నై : మాజీ మంత్రి, సీనియర్‌ నేత సెమ్మలై బాటలో బరువెక్కిన హృదయంతో వైదొలుగుతున్నానని మాజీ స్పీకర్, సీనియర్‌  నేత పి. ధనపాల్‌ ప్రకటించారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. పార్టీలోని తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్‌ నేత, తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పి. ధనపాల్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ధనపాల్‌ అన్నాడీంకే  ప్రభుత్వ హయాంలో 2012–2016 , 2016–2021 మధ్య కాలంలో దాదాపు 10 సంవత్సరాల పాటు స్పీకర్‌గా సుదీర్ఘ సేవలు అందించారు. ఆయన 1977, 1980, 1984, 2001 ఎన్నికలలో సంఖగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 జయలలిత క్యాబినెట్‌లో ఆహార, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011లో రాశిపురం, 2016లో అవినాశి నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పించలేదు.

రాజీనామా అనంతరం ధనపాల్‌ వ్యాఖ్యలు.. 
పార్టీకి రాజీనామా చేసినానంతరం ధనపాల్‌ ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. నేను సైకిల్‌పై తిరుగుతూ, రక్తం ధారపోసి నిర్మించిన పార్టీ ఈ రోజు ముక్కలైపోవడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో  ప్రస్తుతం సీనియర్లకు ప్రాధాన్యత లేదని, అందరినీ విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అందుకే ప్రజలు కూడా తాజాగా పార్టీని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని, ఈ రాజకీయ పరిస్థితులు సృష్టించిన తీవ్ర డిప్రెషన్‌ (మానసిక వేదన) వల్లే తాను అన్నాడీఎంకేకు  రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా, తన కుమారుడు లోకేష్‌ తమిళసెల్వన్‌ టీవీకేలో చేరి, రాసిపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడని, కేబినెట్‌ విస్తరణలో అతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కొంత ఉపశమనాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రెండు రోజుల క్రితం సీనియర్‌ నేత సెమ్మలై పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన బాటలో ధనపాల్‌ అడుగులు వేయడంతో అన్నాడీఎంకే నుంచి మరెంత మంది సీనియర్లు మున్ముందు తప్పుకోనున్నారో అన్న చర్చ ఊపందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement