ముందు లా వాపసీ.. తర్వాతే ఘర్‌ వాపసీ

Talks of farmers and government fail again - Sakshi

తెగేసి చెప్పిన రైతు సంఘాల నేతలు

అసంపూర్ణంగా ముగిసిన చర్చలు

15న మళ్లీ చర్చలు

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ఇరు వర్గాలు పట్టు వీడకపోవడంతో రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు మరోసారి అసంపూర్ణంగా ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శుక్రవారం కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్, పియూష్‌ గోయల్, సోమ్‌ ప్రకాశ్‌ 41 మంది రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన 8వ విడత చర్చలు ఎలాంటి సానుకూల ఫలితం సాధించకుండానే వాయిదా పడ్డాయి. మరో విడత చర్చలు జనవరి 15న జరగనున్నాయి. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు రైతు నేతలు జనవరి 11న సమావేశం కానున్నారు.  చట్టాలను వెనక్కు తీసుకున్న (లా వాపసీ) తరువాతే.. తాము ఇళ్లకు వెళ్తామని(ఘర్‌ వాపసీ) రైతులు చర్చల సందర్భంగా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.

చట్టాల రద్దు కోసం చివరి శ్వాస వరకు పోరాడుతామన్నారు. మరోవైపు, చట్టాల రద్దు ప్రసక్తే లేదన్న ప్రభుత్వం.. ఆ చట్టాల్లోని అభ్యంతరకర నిబంధనలపై చర్చకు సిద్ధమేనని పునరుద్ఘాటించింది. చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరింది. దేశవ్యాప్తంగా రైతుల్లో అత్యధికులు ఈ చట్టాలకు మద్దతిస్తున్నారని వాదించింది. దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని రైతు నేతలకు సూచించింది. వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 11న విచారణ జరగనున్న నేపథ్యంలో.. తదుపరి చర్చల తేదీని జనవరి 15గా నిర్ణయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సాగు చట్టాల చట్టబద్ధతను సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశముందని పేర్కొన్నాయి. ‘నిజానికి వ్యవసాయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు కూడా ప్రకటించింది. సమస్యను పరిష్కరంచాలన్న ఆలోచన మీకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఏ విషయం స్పష్టంగా చెప్పండి. మా నిర్ణయం మేం తీసుకుంటాం. అంతేకానీ, అనవసరంగా అందరి సమయం వృధా చేయొద్దు’అని రైతు నేతలు ప్రభుత్వానికి సూటిగా చెప్పారు. ‘చట్టాలను రద్దు చేయలేం, చేయబోం అని ప్రభుత్వం కూడా రైతు నేతలకు స్పష్టంగా చెప్పింది’అని చర్చల్లో పాల్గొన్న ఆల్‌ ఇండియా కిసాన్‌సంఘర్‌‡్ష కో ఆర్డినేషన్‌ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) సభ్యురాలు కవిత కురుగంటి తెలిపారు.

రైతు ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు ప్రారంభమైన గంట తరువాత.. రైతు ప్రతినిధులు జీతేంగే యా మరేంగే(గెలుపో లేదా మరణమో) అన్న నినాదమున్న పేపర్లు ప్రదర్శిస్తూ మౌనంగా కూర్చోవడంతో, ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు సమావేశం స్థలి నుంచి బయటకు వెళ్లారు. మొత్తంగా శుక్రవారం ఇరు వర్గాల మధ్య చర్చలు సుమారు 2 గంటల పాటు మాత్రమే జరిగాయి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని చర్చల అనంతరం రైతు నేత బల్బీర్‌ రాజేవాల్‌ విమర్శించారు. 

చట్టాల రద్దు విషయంలో ఏ కోర్టుకు వెళ్లబోమని, చట్టాలను వెనక్కు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఏఐకేఎస్‌సీసీ నేతలు చెప్పారు.  ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే 26న ట్రాక్టర్‌ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు.  ‘ఈ ఆందోళనల్లో ఎంతో మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. ఎంతోమంది కూతుర్లు తమ తండ్రులను కోల్పోయారు. అయినా ప్రభుత్వం మనసు కరగడం లేదు’అని నిరసనల్లో పాల్గొంటున్న ఒక మహిళారైతు ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులతో పాటు ఆందోళనల్లో పాల్గొంటున్న పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో శుక్రవారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమావేశమయ్యారు.

అమిత్‌ షాతో భేటీ
చర్చలు ప్రారంభం కావడానికి ముందు నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రత్యేకంగా బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ఆ తరువాత హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కూడా షాతో సమావేశమయ్యారు.
 
ప్రత్యామ్నాయాలు చూపట్లేరు

సాగు చట్టాల రద్దు ప్రతిపాదనకు ప్రత్యామ్నాయాలను సూచించమని కోరామని, అయితే, రైతు నేతలు చట్టాల రద్దుకే పట్టుబట్టడంతో ఎలాంటి ఫలితం రాకుండానే చర్చలు వాయిదా పడ్డాయని నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. తదుపరి చర్చల నాటికైనా రైతు నేతలు ప్రత్యామ్నాయాలతో వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసులో ఇంప్లీడ్‌ కావాలని రైతు నేతలను కోరారా? అన్న ప్రశ్నకు అలాంటి ప్రతిపాదనేదీ లేదన్నారు. ఈ చట్టాలను అమలు చేసే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ ప్రతిపాదన ఏదీ రైతుల నుంచి రాలేదన్నారు.  

చర్చలు విఫల కావడంతో రైతు సంఘం నేత రవీందర్‌ కౌర్‌ కంటతడి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top