పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి | Suvendu Adhikari likely to be BJP 1st Bengal Chief Minister | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

May 8 2026 4:46 PM | Updated on May 8 2026 6:44 PM

Suvendu Adhikari likely to be BJP 1st Bengal Chief Minister

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం శనివారం (రేపు) అధికారంలోకి రానుంది. రేపు ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇవాళ కోల్‌కతాలో పర్యటించి, బీజేపీకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్‌ న్యూటౌన్‌లోని బిస్వ బంగ్లా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ వర్గాల ప్రకారం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండగా, ఇద్దరు మహిళలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించే నిర్ణయం తీసుకున్నారు.

బెంగాల్‌లో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నందిగ్రామ్‌, భవానిపూర్‌ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. భవానిపూర్‌లో 15 వేల ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీని ఓడించారు.

కౌన్సిలర్‌ టూ సీఎం
సువేందు అధికారి పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ‘జెయింట్ కిల్లర్’గా పేరుపొందిన నేత. ఆయన కాంగ్రెస్‌ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తృణమూల్‌ కాంగ్రెస్‌ ద్వారా ఎదిగి, చివరికి బీజేపీలో చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

జననం: 15 డిసెంబర్ 1970, కార్కులి గ్రామం, పూర్బ మెదినిపూర్, పశ్చిమ బెంగాల్‌

తల్లిదండ్రులు: సిసిర్ అధికారి (మాజీ యూనియన్ మంత్రి, ఎంపీ), గాయత్రి అధికారి

విద్య: 2011లో రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు

వివాహం: అవివాహితుడు

రాజకీయ ప్రస్థానం

1995: కాంగ్రెస్‌లో కాంతి మునిసిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు

1998: తండ్రితో కలిసి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌ (TMC)లో చేరారు

2006: కాంతి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, అదే సంవత్సరం కాంతి మునిసిపాలిటీ చైర్మన్‌గా కూడా అయ్యారు

నందిగ్రామ్ ఉద్యమం
2007: నందిగ్రామ్‌లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు

టీఎంసీకి ప్రజాదరణ తెచ్చారు

ఈ ఉద్యమం మమతా బెనర్జీని రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు తెచ్చింది

బెంగాల్ తొలి BJP ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

తృణమూల్ కాంగ్రెస్‌లో ఎదుగుదల
2009: తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు

2014: మళ్లీ తమ్లుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు

2016: నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మమతా బెనర్జీ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు

2018–2020: నీటి వనరులు, సాగు శాఖ మంత్రిగా కూడా పనిచేశారు

బీజేపీలో చేరిక
2020 నవంబర్–డిసెంబర్: టీఎంసీ నుంచి రాజీనామా చేసి, 19 డిసెంబర్ 2020న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు

కారణం: మమతా బెనర్జీ వారసుడిగా అభిషేక్ బెనర్జీని ముందుకు తేవడంపై విభేదాలు

ఎన్నికల విజయాలు
2021: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు

2026: నందిగ్రామ్‌, భవానిపూర్‌ రెండింటిలోనూ గెలిచి, మమతా బెనర్జీని ఆమె స్వస్థల నియోజకవర్గంలో ఓడించారు

ఇది 1967 తర్వాత మొదటిసారి ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో గెలిచి, సిట్టింగ్ సీఎంను ఓడించిన ఘట్టం

ముఖ్య పదవులు
2009–2016: లోక్‌సభ సభ్యుడు (తమ్లుక్)

2016–2020: పశ్చిమ బెంగాల్‌ మంత్రివర్గంలో రవాణా, నీటి వనరులు శాఖలు

2020–2021: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్

2021–2026: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత

2026 నుంచి: పశ్చిమ బెంగాల్‌ 9వ ముఖ్యమంత్రి

జెయింట్ కిల్లర్ అనే బిరుదు: మమతా బెనర్జీని నందిగ్రామ్‌ (2021), భవానిపూర్‌ (2026)లో ఓడించడం వల్ల ఈ పేరు వచ్చింది.

నైపుణ్యం: గ్రామీణ స్థాయిలో బలమైన కేడర్‌ నిర్మాణం, ఉద్యమాల ద్వారా ప్రజల్లో ప్రభావం చూపడం ఆయన ప్రత్యేకత.

బీజేపీ తొలి సీఎం: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.

Advertisement
 
Advertisement
Advertisement