
సాక్షి,న్యూఢిల్లీ: సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్‌కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. రైతు చట్టాల ఆందోళనపై మీరు రీట్వీట్ మాత్రమే చేయలేదు. కొంచెం మసాలా యాడ్ చేశారని మండిపడింది.
2020-21లో రైతు చట్టాలకు సంబంధించిన ఆందోళన సమయంలో కంగనారౌనత్ ఓ మహిళా రైతును ఉద్దేశిస్తూ రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో మహిళా రైతు కంగనారౌనత్‌పై పరువు నష్టం దావా వేశారు. తాజాగా, పంజాబ్ రాష్ట్రం బాథిండా కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో కంగనాపై నమోదైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అంతేకాదు.. మహిళ రైతు గురించి మీరు ట్వీట్‌లు మాత్రమే కాదు మసాల్ యాడ్ చేశారు’అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
2020-21 దేశ రాజధాని ఢిల్లీ రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో మరో ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. అయితే, రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న మహీందర్ కౌర్.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాల్గొన్న బిల్కిస్ బానో ఇద్దరూ ఒకటేనంటూ తాను చేసిన పోస్టును కంగనా రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్‌పై మహీందర్ కౌర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసునే కొట్టేయొమని కంగాన న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు.
కంగనా ఇప్పటికే పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు సూచన మేరకు ఆమె ట్రయల్ కోర్టులోనే న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.