వీధుల్లో కుక్కలు కనపడ్డానికి వీల్లేదు: సుప్రీం కోర్టు | Supreme Court refuses to recall stray dog shelter order | Sakshi
Sakshi News home page

వీధుల్లో కుక్కలు కనపడ్డానికి వీల్లేదు: సుప్రీం కోర్టు

May 19 2026 10:59 AM | Updated on May 19 2026 3:21 PM

Supreme Court refuses to recall stray dog shelter order

వీధి కుక్కల అంశం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే తమ గైడ్‌ లైన్స్‌ను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలన్న విజ్ఞప్తులను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేస్తూ.. జంతు ప్రేమికులకు ఝలక్‌ ఇచ్చింది. 

వీధి కుక్కల దాడుల వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రతి పౌరుడు సొసైటీలో స్వేచ్ఛగా(ప్రత్యేకించి పబ్లిక్‌ ప్లేసుల్లోనూ) జీవించాలే తప్ప భయంతో కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్ 7న కఠిన ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం.. 

ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుండి వీధి కుక్కలను షెల్టర్‌లకు తరలించాలని చెప్పింది. వాటికి స్టెరిలైజ్, వ్యాక్సినులు వేసినా కూడా తిరిగి పబ్లిక్‌ప్లేసుల్లో వదలొద్దని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే.. ఈ మార్గదర్శకాలను సవరించాలంటూ జంతు సంక్షేమ సంఘాలు, డాగ్ ఫీడర్స్ పిటిషన్లు వేశారు. 

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ రూల్స్‌-2023కు విరుద్ధమని వాదించారు. ఆ నియమాల ప్రకారం, కుక్కలను స్టెరిలైజ్ చేసి, వ్యాక్సిన్ వేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా.. ఆ వాదనతో ఏకీభవించలేదు. తమ ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది.

తాజా విచారణలో.. ప్రేక్షక పాత్ర వహిస్తున్న ప్రభుత్వాల తీరును సుప్రీం కోర్టు ఆక్షేపించింది.  చిన్న పిల్లలు, వృద్ధులు, విదేశీ పర్యాటకులు కూడా వీధి కుక్కల దాడులకు గురైన ఘటనలను కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై దాడులు బాధాకరమని వ్యాఖ్యానించింది. తాము ఆదేశాలిచ్చాక కూడా కుక్క కాట్ల ఘటనలు చోటు చేసుకుంటుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 ‘‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్” అనే డార్వినియన్ సూత్రం వాస్తవంగా అమలవుతున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల వల్ల కలిగే ప్రమాదాలను నిర్లక్ష్యం చేయరాదని కోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రజల ప్రాణ భద్రతను కాపాడటం ప్రభుత్వాల కర్తవ్యమని.. ఈ విషయంలో ప్రభుత్వాలు పాసివ్ స్పెక్టేటర్‌లుగా ఉండకూడదని.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాబట్టి తమ గైడ్‌లైన్స్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.  నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాటిని ఆహారం పెట్టాలని జంతు ప్రేమికులకు స్పష్టం చేసింది.

‘‘వీధుల్లో కుక్కలు కనిపించకూడదు. పిచ్చి కుక్కలకు యుథనేషియా ఇచ్చి చంపేయండి. ప్రమాదకర కుక్కలను సహించొద్దు. రేబీస్ కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించాలి. ప్రతిజిల్లాలో నియంత్రణకు యంత్రాంగం ఉండాల్సిందే. వీధి కుక్కల బెడదను నివారించాల్సిందే. ఇదొక సీరియస్‌ పబ్లిక్‌ న్యూసెన్స్‌.  మా ఆదేశాలను పాటించని అధికారులు కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని సుప్రీం కోర్టు తీర్పు సందర్భంగా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement