
న్యూఢిల్లీ: ఇంటిని కూల్చేస్తామంటూ నోటీసు ఇచ్చి 24 గంటల్లోపే బుల్డోజర్‌తో ఇంటిని కూల్చేస్తున్న ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి మండిపడింది. నిబంధనలను పాటిస్తూనే ఇళ్ల కూలి్చవేత ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొనసాగిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చేసిన వాదనలను జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాల సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది.
2023లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్‌కు చెందినదిగా భావిస్తున్న ప్రయాగ్‌రాజ్ నగరంలోని భవనాలను అధికారులు కూల్చేశారు(Prayagraj Demolitions). దీనిపై జులి్ఫకర్ హైదర్ అనే న్యాయవాది, ప్రొఫెసర్ అలీ అహ్మద్, ఇద్దరు వితంతువులు, మరో వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. గ్యాంగ్‌స్టర్‌విగా భావించి మా ఇళ్లను కూల్చేశారని బాధితులు కేసు వేశారు. అయితే ఈ కేసును అలహాబాద్ హైకోర్టు కొట్టేయడంతో వాళ్లంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
‘‘ఇళ్లను నిర్దయగా కూల్చేయడం చూస్తుంటే మాకే షాకింగ్‌గా ఉంది. కూలి్చవేతకు అనుసరించిన విధానం సైతం షాకింగ్‌కు గురిచేస్తోంది. మార్చి ఆరో తేదీ రాత్రి నోటీసులు ఇచ్చి మరుసటి రోజే కూల్చేస్తారా?. ఇలాంటి పద్ధతిని న్యాయస్థానాలు ఏమాత్రం అంగీకరించవు. ఒక్క కేసులో వీటిని పట్టించుకోకుండా ఉన్నామంటే ఇక ఇదే కూలి్చవేతల ధోరణి కొనసాగుతుంది. నోటీసులు అందుకున్నాక బాధితులు వాటిపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వలేదు. 24 గంటల్లోపు భవనాలను కూల్చేశారు. ఈ కేసులో తిరిగి ఇంటిని నిర్మించుకుంటామని బాధితులు కోరితే అందుకు మేం అనుమతిస్తాం. అయితే కేసు తుదితీర్పు వాళ్లకు వ్యతిరేకంగా వస్తే బాధితులే ఆ కొత్త ఇళ్లను నేలమట్టం చేయాల్సి ఉంటుంది’’అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం.
దీనిపై ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్(Attorney General) వాదించారు. ‘‘లీజు గడువు దాటాక అక్రమంగా ఆ నివాసస్థలాల్లో పిటిషనర్లు ఉంటున్నారు. వాస్తవానికి 2020 డిసెంబర్‌లో తొలిసారి, 2021 జనవరి, మార్చి నెల ఆరో తేదీన నోటీసులు ఇచ్చారు. తర్వాతే కూల్చారు’’అని వాదించారు. దీనిపై జడ్జి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘గతంలో సాధారణ రీతిలో నోటీసులు ఇచ్చారు. చట్టప్రకారం రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. అలాకాకుండా మామూలుగా పంపేసి, చివరి నోటీసు మాత్రం రిజిస్టర్ పోస్ట్ లో పంపించి వెంటనే కూల్చేస్తారా?’’అని ధర్మాసనం నిలదీసింది. మళ్లీ ఇంటి నిర్మాణాల విషయంలో అఫిడవిట్ సమర్పించేందుకు పిటిషనర్లను అనుమతిస్తూ కేసు విచారణను న్యాయస్థానం వాయిదావేసింది.
‘క్రికెట్’ నినాదాలతో కూల్చేశారు
గత నెల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ ఆట సందర్భంగా భారతవ్యతిరేక నినాదాలు చేశారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి తమ ఇల్లు కూల్చారంటూ కితాబుల్లా హమీదుల్లా ఖాన్ వేసిన పిటిషన్‌పై స్పందన తెలపాలని మహారాష్ట్ర సర్కార్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఆస్తుల కూలి్చవేతకు సంబంధించి గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఈ అంశంలో సర్కార్‌పై, మాలాŠవ్‌న్ మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటర్‌లపై ఉల్లంఘన కేసు నమోదుచేయాలని బాధితుడు సుప్రీంకోర్టును కోరాడు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి సింధుదుర్గ్ జిల్లాలో పాతసామాను దుకాణం, ఇల్లు రెండూ అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ అధికారులు ఫిబ్ర వరి 24న వాటిని కూల్చేశారు. భారతవ్యతిరేక నినాదాలు చేశాడంటూ తొలుత పిటిషనర్‌తోపాటు అతని 14ఏళ్ల కుమారుడిని అరెస్ట్‌చేసి తర్వాత కుమారుడిని వదిలేశారు. తర్వాత భార్యాభర్తలను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. ఈ సమయంలోనే ఇల్లు, దుకాణం కూల్చేశారు.