బుల్డోజర్‌ న్యాయం రాజ్యాంగ విరుద్ధం | SUPREME COURT JUDGMENT Over BULLDOZER CASE In UP | Sakshi
Sakshi News home page

బుల్డోజర్‌ న్యాయం రాజ్యాంగ విరుద్ధం

Published Wed, Nov 13 2024 11:08 AM | Last Updated on Thu, Nov 14 2024 5:54 AM

SUPREME COURT JUDGMENT Over BULLDOZER CASE In UP

ముందస్తు షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదు  

నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలి   

సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు 

తలదాచుకోవడానికి ఒక సొంత గూడు సమకూర్చుకోవాలని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కలలు కంటుంది. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. ఇల్లు అంటే ఒక కుటుంబమంతటి ఆశల కలబోత. ఇల్లు జీవితానికి స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తుంది. మనుషులకు సంతృప్తి, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21(వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితానికి రక్షణ)లో పౌరులు ఒక గూడు కలిగి ఉండే హక్కు కూడా ఒక భాగమే. 

ఏదైనా కేసులో ఒక వ్యక్తి నిందితుడు లేదా దోషి అయితే.. అతడి కుటుంబం నివసిస్తున్న ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేయవచ్చా? వారికి నిలువ నీడ లేకుండా చేయొచ్చా? ఒక్కరు నేరం చేస్తే అతడి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలా? అనేది చాలా ముఖ్యమైన విషయం. న్యాయ వ్యవస్థ అధికారాలను కార్యనిర్వాహక వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. బుల్డోజర్‌ న్యాయం ఎంతమాత్రం సరైంది కాదు. ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడు లేదా దోషి అయినంత మాత్రాన అతడి ఇంటిని కూల్చివేయడం చట్టబద్ధ పాలనా సూత్రాలకు వ్యతిరేకం. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
 – సుప్రీంకోర్టు                 

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనధికారికంగా అమలవుతున్న ‘బుల్డోజర్‌ న్యాయం’పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్‌ చర్యలు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని, ఒక వ్యక్తి నేరాన్ని నిర్ధారించే బాధ్యత న్యాయవ్యవస్థపైనే ఉందని వెల్లడించింది. ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే జరిమానా తప్పదని, దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం వదిలిపెట్టబోదని హెచ్చరించింది. 

ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకించడంతోపాటు ఇలాంటి కూల్చివేతల విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం.. బుల్డోజర్‌ న్యాయం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ         అక్టోబర్‌ 1న తమ తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ కేసుపై బుధవారం జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 95 పేజీల తీర్పు వెలువరించింది.

 ఒకరు నేరానికి పాల్పడితే అతడి కుటుంబాన్ని శిక్షించడాన్ని రాజ్యాంగం గానీ, నేర న్యాయ వ్యవస్థ గానీ అనుమతించబోవని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్రాల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కొన్ని కేసుల్లో స్థానిక మున్సిపల్‌ చట్టాలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తున్నారని, అయితే, కొన్ని సందర్భాల్లో అవి నిందితులవి అయి ఉంటున్నాయని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. తప్పనిసరిగా కూల్చివేయాల్సి వస్తే అదే చివరి మార్గం తప్ప మరో మార్గం లేదని నిరూపించాలని పేర్కొంది. అనివార్యంగా నేలమట్టం చేయాల్సిన ఇళ్ల విషయంలోనూ ‘రూల్‌ ఆఫ్‌ లా’ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.  

అది ప్రభుత్వ అధికారుల విధి కాదు  
నిందితుడి నేరం రుజువు కాక ముందే అతడిని శిక్షించే విధానాన్ని న్యాయవ్యవస్థ హర్షించదని, రాత్రిపూట మహిళలను, పిల్లలను వీధుల్లో నిలబడేలా చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉద్ఘాటించింది. ఏదైనా కేసులో ఒక వ్యక్తిని దోషిగా తేల్చడం, జరిమానా లేదా శిక్ష కింద అతడికి ఇంటిని కూల్చడం ప్రభుత్వ అధికా రుల విధి కాదని వెల్లడించింది. ముందస్తుగా షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి దేశం మొత్తానికి వర్తిస్తాయని పేర్కొంది. అయితే.. రహదారులు, నదీ తీరాల్లోని నిర్మాణాలు, అక్రమ భవనాలు లేదా నిర్మాణాలపై తీసుకునే చర్యలకు ఈ మార్గదర్శకాలు వర్తించబోవని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది.  

ఒక్కరు చేసే నేరానికి కుటుంబమంతటికీ శిక్షా? 
→ నిందితుడి నేరం రుజువు కాకముందే అతడిని శిక్షించవద్దు 
→ మహిళలు, పిల్లలను రాత్రిపూట రోడ్డున పడేయొద్దు   
→ ముందస్తు షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదు.  
→ నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇచ్చి తీరాలి
→ మార్గదర్శకాలు పాటించకపోతే అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవు
→ సుప్రీంకోర్టు కీలక తీర్పు  
→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ  
 

సుప్రీం కోర్టు మార్గదర్శకాలు 
→ ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించకూడదు. అధికారులు నోటీసు ఇచ్చాక 15 రోజుల్లోగా లేదా స్థానిక మున్సిపల్‌ చట్టాలు నిర్దేశించిన సమయంలోగా స్పందించాల్సి ఉంటుంది. నోటీసు అందుకున్న వ్యక్తి వివరణ ఇవ్వాలి.  
→ ఇంటి సొంతదారు/అందులో ఉంటున్న వ్యక్తికి రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా నోటీసు పంపించాలి. అదనంగా నోటీసు కాపీని ఇంటి బయట స్పష్టంగా కనిపించేలా అతికించాలి. భవనాన్ని ఎందుకు కూల్చుతున్నారో ఆ నోటీసులో వివరించాలి. కూల్చివేత చర్యను నిరోధించడానికి ఏం చేయవచ్చో కూడా అదే నోటీసులో చెప్పాలి. 
→ నోటీసు జారీ చేయడానికి, రిజిస్టర్డ్‌ పోస్టులో పంపడానికి, ప్రతిస్పందనను స్వీకరించడానికి, షోకాజ్‌ నోటీసుల వివరాలు, ఇతర ఉత్తర్వుల కోసం పురపాలక సంఘాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు మూడు నెలల్లోగా ఒక డిజిటల్‌ పోర్టల్‌ సిద్ధం చేసుకోవాలి.  
→ ప్రజల వినతులు తెలుసుకోవడానికి, తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.  
→ అనధికారిక కట్టడాన్ని తొలగించడానికి లేదా పూర్తిగా కూల్చివేయడానికి 15 రోజుల సమయం ఇవ్వాలి.  
→ ఇళ్ల కూల్చివేత వీడియోను చిత్రీకరించాలి. వీడియో రికార్డ్‌ను భద్రపర్చాలి.  
→ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోషిగా తేలితే జరిమానా లేదా చట్ట ప్రకారం శిక్ష తప్పదు.  
→ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటిని కూల్చివేసినట్లు తేలితే సంబంధిత అధికారులు అందుకు బాధ్యత వహించాలి. ఆ ఇంటిని వారి సొంత ఖర్చులతోనే మళ్లీ నిర్మించాల్సి ఉంటుంది. అదనంగా డ్యామేజీ ఖర్చులు చెల్లించాలి. 
→ ఏదైనా ఆస్తిపై బుల్డోజర్‌ చర్య తీసుకునే ముందు, వ్యక్తిగతంగా విచారించడానికి ఆ ఆస్తి యజమానికి అవకాశం కలి్పంచాలి. అంతేకాదు.. ఉత్తర్వులపై అధికారులు మౌఖిక సమాచారం ఇవ్వాలి.   
→ బుల్డోజర్‌ చర్యపై నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది జిల్లా మేజి్రస్టేట్‌(డీఎం) చూడాలి.  నిబంధనలు పాటించకుండా ఇళ్లు, భవనాలను కూల్చివేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి.   
→ చట్టం ప్రకారం పౌరులందరినీ సమానంగా చూడాలి. ఇంటిని కూల్చడమనేది ప్రాథమిక హక్కుకు విరుద్ధం. ఒక నిర్మాణాన్ని కూల్చివేయాలంటే నిందితుడి నేపథ్యాన్ని, అతని సామాజికవర్గాన్ని పట్టించుకోవద్దు.   
→ సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తెలియజేస్తూ జిల్లా మేజి్రస్టేట్లు, స్థానిక అధికారులకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సర్క్యులర్లు జారీ చేయాలి.

 

ఇళ్ల కూల్చివేతలపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement