
రాయ్‌పూర్: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులపై లైంగిక ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవటంతోపాటు కుమారుడు మరణానికి కారణం అయ్యాడన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా,ఛత్తీస్‌గఢ్‌లో ఐజీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రతన్‌లాల్ డాంగీపై ఓ ఎస్‌ఐ భార్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది
2003 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఐజీ హోదాలో ఉన్న రతన్‌లాల్ డాంగీపై ఓ ఎస్‌ఐ భార్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఐపీఎస్ అధికారి రతన్‌లాల్ డాంగీపై బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
డీజీపీకి చేసిన ఫిర్యాదులో బాధితురాలు రతన్‌లాల్ డాంగీ తనపై గత ఏడు సంవత్సరాలుగా మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు ఊతం ఇచ్చేలా తనవద్ద కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పారు.వాటి ఆధారంగా ఈ కేసు విచారణ పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఛత్తీస్‌గఢ్ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో బాధితురాలు తనపై డీజీపీకి ఫిర్యాదు చేయడంపై రతన్ లాల్ డాంగీ అప్రమత్తయ్యారు. తిరిగి బాధితురాలిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో డాంగీ బాధితురాలిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. డాంగీ తనను తాను మహిళా బాధితుడినంటూ డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. బాధితురాలు తనను బలవంతంగా వీడియో కాల్స్‌లో అసభ్యంగా ప్రవర్తించమని ఒత్తిడి తెచ్చిందన్నారు. ఇంకా చెప్పుకోలేని విధంగా మహిళ తనని ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, డాంగీ చేసిన ఆరోపణలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఎస్సై భార్యను వేధిస్తుంటే ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడే.. ఐపీఎస్ రతన్‌లాల్ డాంగీ డీజీపీతో ఎందుకు భేటీ అయ్యారు?. ఉన్నతస్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారిని ఎస్‌ఐ భార్య ఎలా వేధిస్తారు?. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?
ఇది ఐపీఎస్ అధికారిపై ఆరోపణల కేసు కావడంతో, పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులపై ఒత్తిడి ఉందా? విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందా?. ఈ కేసు విచారణను పారదర్శకంగా, న్యాయంగా జరిపి బాధితుడెవరో, నిందితుడెవరో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఛత్తీస్‌గఢ్ డీజీపీపై ఉంది. ఒకవేళ ఈ కేసును పోలీస్‌శాఖ మసిపూసిమారేడుగాయగా చేస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందనే అభిపప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు విచారణలో నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం ఎవరికి దక్కుతుందో? బాధితులు ఎవరో? కాలమే నిర్ణయించాల్సి ఉంది.