ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్‌.. కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు

Supreme Court Noted That Announcement Of Freebies By Political Parties Needs To Be Controlled - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిని ఆయా పార్టీలు నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

ఎన్నికల్లో ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపిస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎ‍న్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, అలా చేసే పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఎన్నికల గుర్తును సీజ్‌ చేయాలని ఓ పిటిషనర్ దాఖలు చేసిన  వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా? అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. 

దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఉచిత హామీలను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది. ఉచిత పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుందని ఓటర్లే నిర్ణయించుకోవాలని న్యాయస్థానానికి తెలిపింది.

మొత్తం 6.5 లక్షల కోట్ల అప్పు ఉందని, భారత్‌ కూడా మరో శ్రీలంక అవుతుందని పిటిషనర్‌ అశ్విని ఉపాధ్యాయ్‌ కోర్టుకు తెలిపారు. ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించవచ్చా? అనే అంశాన్ని ఫైనాన్స్ కమిషన్‌ను అడిగి తెలుసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది.

ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఉచిత పథకాలను ప్రకటించి కొన్ని పార్టీలు రాష్ట్రాలను నాశనం చేస్తున్నాయని విమర్శించిన విషయం తెలిసిందే.
చదవండి: ‘పోలీసు రాజ్యంగా మారిన దేశం.. దానికి మోదీనే కింగ్‌’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top