కంటెంట్‌పైనే అభ్యంతరం రచయితలపై కాదు! | Supreme Court hears case concerning NCERT publication of social science textbook | Sakshi
Sakshi News home page

కంటెంట్‌పైనే అభ్యంతరం రచయితలపై కాదు!

May 23 2026 4:32 AM | Updated on May 23 2026 4:32 AM

Supreme Court hears case concerning NCERT publication of social science textbook

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల వివాదంపై సుప్రీంకోర్టు 

గత ఉత్తర్వుల్లోని ప్రతికూల వ్యాఖ్యల తొలగింపునకు ఆదేశాలు 

11వ తరగతి పుస్తకాల్లోని కార్టూన్లపై కేంద్రం అభ్యంతరం 

పాఠ్యాంశాల పరిశీలన బాధ్యత నిపుణుల కమిటీకి

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్య పుస్తకంలోని వివాదాస్పద అంశాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠ్యపుస్తకాల్లోని విషయాలకు (కంటెంట్‌) సంబంధించి మాత్రమే తమకు అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని రూపకల్పన చేసిన విద్యావేత్తలను తప్పుబట్టడం తమ ఉద్దేశం కాదని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఈ మేరకు గతంలో తామిచ్చిన ఉత్తర్వుల్లో రచయితలను ఉద్దేశించి చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేవలం 8వ తరగతి పుస్తకాల్లోనే కాకుండా 11వ తరగతి పాఠ్యపుస్తకాల్లోనూ అభ్యంతరకర కార్టూన్లు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వయసు విద్యార్థులపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని, విద్యా సంబంధిత పుస్తకాల్లో ఇలాంటి వాటికి తావుండరాదని ఆయన పేర్కొన్నారు.

 ఈ అంశాన్ని కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు. వివాదాస్పద కంటెంట్‌ రూపొందించిన వారితో భవిష్యత్తులో ప్రభుత్వం కలిసి పనిచేయదన్న నిర్ణయాన్ని సొలిసిటర్‌ జనరల్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా రచయితలు, విద్యావేత్తల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. 

మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో రచయితల ఉద్దేశాలను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వారి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాల రూపకల్పన సమష్టి బాధ్యత అని, ఇందులో ఏ ఒక్కరినీ బాధ్యులను చేయ డం సరికాదన్నారు. వాటిని ఉత్తర్వుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ‘గత ఉత్తర్వుల్లోని వ్యాఖ్యలతో రచయితలకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. వారి వివరణ విన్న తర్వాత ఆ ప్రతికూల వ్యాఖ్యలను తొలగిస్తున్నాం. మా అభ్యంతరాలు కంటెంట్‌ పైనే తప్ప, రూపొందించిన వ్యక్తులపై కాదు’అని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement