రిజర్వు తీర్పులకు 3 నెలలే గడువు! | Supreme Court Guidelines For High Courts On Reserved Judgments | Sakshi
Sakshi News home page

రిజర్వు తీర్పులకు 3 నెలలే గడువు!

May 30 2026 8:36 AM | Updated on May 30 2026 8:36 AM

Supreme Court Guidelines For High Courts On Reserved Judgments

బెయిల్‌ ఉత్తర్వులు మరుసటి రోజుకల్లా వెలువరించాలి

ఆలస్యమైతే మరో ధర్మాసనానికి కేసు బదిలీ చేయొచ్చు

అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

సాక్షి, న్యూఢిల్లీ: తీర్పులు ఆలస్యమైతే కక్షిదారులకు తీరని నష్టం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పూర్తయి, తీర్పు రిజర్వు చేసిన తేదీ నుంచి మూడు నెలల్లోపే తీర్పులను వెలువరించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులపై మరింత శ్రద్ధ పెట్టాలని హైకోర్టులను ఆదేశించింది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న మితిమీరిన జాప్యానికి అడ్డుకట్ట వేసేలా అన్ని హైకోర్టులు పాటించాల్సిన కఠినమైన, ఏకరూప మార్గదర్శకాలను శుక్రవారం జారీ చేసింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్‌ లాంటి కేసుల్లో నిర్ణయాలు అత్యంత వేగంగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఏళ్ల తరబడి రిజర్వులోనే 
జార్ఖండ్‌ హైకోర్టుకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక మార్గదర్శకాలను వెలువరించింది. కొందరు ఎస్టీ, ఓబీసీ జీవిత ఖైదీల క్రిమినల్‌ అప్పీళ్లపై విచారణను పూర్తిచేసిన జార్ఖండ్‌ హైకోర్టు ఏళ్ల తరబడి తీర్పును వెలువరించకుండా రిజర్వులో ఉంచింది. కనీసం తీర్పు కాపీలను కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని బాధిత ఖైదీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సత్వర న్యాయం పొందడం రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 21 కింద ప్రాథమిక హక్కు అని, తీర్పుల్లో ఇలా ఏళ్ల తరబడి జాప్యం చేయడం తమ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు.

హైకోర్టులకు ఏకరూప నిబంధనలు
హైకోర్టుల్లో తీర్పుల జాప్యాన్ని నివారించేందుకు కచ్చితంగా అమలు చేయాల్సిన మార్గదర్శకాలను ధర్మాసనం వెలువరించింది. ‘వాదనలు ముగిసి రిజర్వులో ఉంచిన కేసుల్లో గరిష్టంగా మూడు నెలల్లోగా తప్పనిసరిగా తీర్పులు వెలువరించాలి. వాదనలు ముగిసిన తర్వాత, తీర్పును రిజర్వు చేసిన తేదీని హైకోర్టు వెబ్‌సైట్‌లో స్పష్టంగా పొందుపరచాలి. బెయిల్‌ పిటిషన్లు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో విచారణ జరిగిన రోజే తీర్పును వెలువరించాలి.

ఒకవేళ రిజర్వు చేస్తే మరుసటి రోజుకల్లా కచ్చితంగా తీర్పు వెలువరించి, అప్‌లోడ్‌ చేయాలి. బెయిల్‌ ఉత్తర్వులు వెలువడిన రోజే ఆ విషయాన్ని సంబంధిత జైలు అధికారులకు తెలియజేసి, విచారణ ఖైదీలను అదే రోజు లేదా మరుసటి రోజుకల్లా విడుదల చేయాలి. అత్యవసర కేసుల్లో తీర్పును వెలువరించేటప్పుడు కేవలం ముఖ్యమైన నిర్ణయాన్ని కోర్టులో చదివితే సరిపోతుంది. పూర్తిస్థాయి తీర్పు కాపీని గరిష్టంగా ఏడు రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

రిజర్వు చేసిన మూడు నెలల తర్వాత కూడా తీర్పు రాకపోతే ఆ విషయాన్ని హైకోర్టు రిజిస్టార్‌ జనరల్, ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడు సీజే ఆ ధర్మాసనానికి మరో రెండు వారాల అదనపు గడువు ఇస్తారు. ఆ తర్వాత కూడా తీర్పు రాకపోతే ఆ కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయవచ్చు. తీర్పు కోసం రిజర్వు చేసిన 3 నెలలకు అదనంగా మరో నెల దాటితే (3+1 నెలలు), కక్షిదారులు తాజా విచారణ కోసం తమ కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని నేరుగా ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకోవచ్చు’అని ధర్మాసనం తన మార్గదర్శకాలను స్పష్టంగా పేర్కొంది.  

వ్యవస్థాగత లోపాలను సరిదిద్దేందుకే
పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ విపిన్‌ ఎం.పంచోలిల త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ పూర్తయిన తర్వాత కూడా ఏకారణం లేకుండా తీర్పు ఇవ్వడం ఆలస్యమైతే కక్షిదారులు తీవ్రంగా నష్టపోతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము జారీ చేస్తున్న ఈ మార్గదర్శకాలు ఏ నిర్దిష్ట న్యాయమూర్తిని లేదా కోర్టును తప్పుబట్టే ఉద్దేశంతో ఇచ్చినవి కావంది. వ్యవస్థాగత జాప్యాన్ని నివారించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌.. హైకోర్టు న్యాయమూర్తిగా తన 15 ఏళ్ల సర్వీసులో ఏనాడూ తీర్పును రిజర్వు చేసి మూడు నెలలు దాటనివ్వలేదని గుర్తుచేశారు. తీర్పుల కోసం కక్షిదారులు ఏళ్ల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement