సివిల్స్‌ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే

Supreme Court dismisses by Last Attempt Civil Service extra chance - Sakshi

సివిల్స్‌ అభ్యర్థుల పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా 2020 అక్టోబర్‌లో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష రాయలేక చివరి ప్రయత్నం(లాస్ట్‌ అటెంప్ట్‌) సైతం కోల్పోయిన వారికి మరో అవకాశం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల 2020లో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతూ సివిల్‌ సర్వీసెస్‌లో ‘చివరి ప్రయత్నం’ దాటిపోయిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎం.ఎ.ఖన్వీల్కర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. ఈ మేరకు 40 పేజీల తీర్పును వెలువరించింది.

ఇలా లాస్ట్‌ అటెంప్ట్‌లో పరీక్ష రాయలేకపోయినవారికి మరో అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, సివిల్స్‌ అభ్యర్థుల వయో పరిమితిలోనూ ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సడలింపులు ఇవ్వడం ఇతర అభ్యర్థులపై వివక్ష చూపినట్లే అవుతుందని స్పష్టం చేశారు.

జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 6 సార్లు సివిల్స్‌ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 32 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు సివిల్స్‌ రాయొచ్చు. వయో పరిమితి 35 సంవత్సరాలు. ఇక ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా ఈ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 37 ఏళ్లు. గత ఏడాది కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సివిల్స్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల 10,000 మందికిపైగా అభ్యర్థులు నష్టపోతారని అంచనా. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top