టాయిలెట్లు, నాప్‌కిన్ల కొరత సాకుతో బాలికలను బడికి దూరం చేయరాదు  | Supreme Court directs implementation of menstrual health facilities in schools | Sakshi
Sakshi News home page

టాయిలెట్లు, నాప్‌కిన్ల కొరత సాకుతో బాలికలను బడికి దూరం చేయరాదు 

May 26 2026 12:57 AM | Updated on May 26 2026 12:57 AM

Supreme Court directs implementation of menstrual health facilities in schools

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఆదేశాల అమలుపై మూడు నెలలకోసారి సమీక్ష

న్యూఢిల్లీ: స్కూళ్లలో శానిటరీ నాప్కిన్లు, వేరుగా టాయిలెట్లు లేవనే ఒకే ఒక్క కారణంతో బాలికలు చదవుకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 30వ తేదీన తాము వెలువరించిన ఆదేశాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బడుల్లో తుచ తప్పక అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని మరోసారి కోరింది. 

విద్యార్థినులకు ఉచిత శానిటరీ నాప్కిన్లు అందించడం, పాఠశాలల్లో బాలికలకు వేరుగా నీటి వసతి కలిగిన పనిచేసే మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించేలా చర్యలు వేగవంతం చేశామని సోమవారం జస్టిస్‌ జేబీ పార్థివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ల ధర్మాసనానికి కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అర్చనా పాఠక్‌ దవే విన్నవించారు. 

స్పందించిన ధర్మాసనం..‘ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోండి. అవి మన దేశంలోని మహిళలు, బాలికల మేలు కోసమే. కేవలం టాయిలెట్లు, నాప్కిన్లు లేవని బాలికలు చదువు మానేసి ఇంటి పనులకు పరిమితం కారాదు’అని పేర్కొంది. అదేవిధంగా, తమ ఆదేశాల అమలు తీరుపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వివరాలను సేకరించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష కొనసాగిస్తూనే ఉండాలని తెలిపింది. ఆదేశాల అమలుపై ప్రతి మూడు నెలలకోసారి తమకు నివేదిక అందజేయాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించింది. 

తాము వాటిపై సమీక్ష చేపడతామంది. ఈ అంశంపై సెప్టెంబర్‌ ఒకటో తేదీన తదుపరి విచారణ జరుపుతామని, ఇందుకుగాను ఆగస్ట్‌ 15కల్లా నివేదిక అందజేయాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సహకారం అందించాలని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని పేర్కొంది. ఈ సందర్భంగా ఒక మధ్యంతర పిటిషనర్‌ తరఫు న్యాయవాది జనవరి 30వ తేదీ నాటి ఆదేశాల్లో ఉన్న ఆక్సో–బయోడీగ్రేడబుల్‌ శానిటరీ నాప్కిన్ల గురించి ప్రస్తావించారు. అవి పర్యావరణ హితమైనవి కావని తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ను ఆదేశించింది.

ఆ కీలక తీర్పులో ఏముంది? 
జనవరి 30వ తేదీన అత్యున్నత న్యాయస్థానం..‘రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో రుతుక్రమ ఆరోగ్య హక్కు కూడా భాగమే. రుతుక్రమ పరిశుభ్రతకు తగు సదుపాయాలు లేకుంటే బాలికలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. అంతిమంగా వారు వెనుకబాటుకు గురవుతారు. వీటిని నివారించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పర్యావరణ హిత శానిటరీ నాప్‌కిన్లను బాలికలకు పూర్తిగా ఉచితంగా అందించాలి. అదేవిధంగా, సక్రమంగా పనిచేసే, నీటి వసతి కలిగిన టాయిలెట్లను బాలికల కోసం వేరుగా నిర్మించాలి’అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement