
అప్పుడే మిగతా వారికి గట్టి సందేశం వెళుతుంది
పంట వ్యర్థాల కాల్చివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కాలుష్య మండళ్లలో ఖాళీలను భర్తీచేయండి
యూపీ, హరియాణా, రాజస్తాన్, పంజాబ్ ప్రభుత్వాలకు కోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారణమవుతున్న రైతులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. కొందరు రైతులను కటకటాల వెనక్కి నెడితేనే ఇతర రైతుల్లో భయం ఉంటుందని, వ్యర్థాలను తగలబెట్టే రైతులకు గట్టి సందేశం ఇచ్చిన వాళ్లమవుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, పంజాబ్‌లలో రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ‘రైతులు నిజంగా ప్రత్యేకమైనవాళ్లే. వాళ్ల కారణంగానే మనం ఆహారం తినగల్గుతున్నాం. అంతమాత్రాన మనం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా కూర్చోలేం కదా.
పంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి కదా? వాయుకాలుష్యంతో పర్యావరణానికి హాని తలపెడుతున్న కొందరు రైతులను అరెస్ట్‌చేస్తేనే మిగతా వాళ్లకు గట్టి సందేశం వెళుతుంది. తప్పు చేసిన రైతులను శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయని మీకు తెలియదా? పర్యావ రణాన్ని కాపాడాలనే సత్‌సంకల్పం మీకు ఉంటే రైతులను అరెస్ట్‌చేయడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని న్యాయస్థానం నిలదీసింది.
‘‘పంట వ్యర్థ్యాలను జీవఇంధనంగా ఉపయోగంచవచ్చన్న వార్తలను మేం కూడా వార్తాపత్రికల్లో చదివాం. ఇలా సద్వినియోగం చేసుకోండి అని మేం పదేపదే చెప్పలేం’’ అని సీజేఐ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ‘సీఏక్యూఎం, సీపీసీబీల్లో పోస్ట్‌లను మూడు నెలల్లోపు భర్తీచేయండి. పదోన్నతి పోస్ట్‌లను ఆరు నెలల్లోపు భర్తీచేయండి’ అని కోర్టు ఆదేశించింది.
రైతులు కథలు చెబుతున్నారు
ఈ కేసులో పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, అమికస్ క్యూరీ(కోర్టు సహాయకురాలు)గా అపరంజిత హాజరయ్యారు. గతేడాదితో పోల్చితే పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టిందని మెహ్రా న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఏడాది వ్యర్థాల దహనాలను మరింతగా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఈ వాదనలతో అమికస్ క్యూరీ అపరంజిత విభేదించారు. రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటానికి ప్రభుత్వం రైతులకు నగదు ప్రోత్సాహకాలు, ఇతర పరికరాలు అందిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు లేదని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
ఉపగ్రహాలు తమ పంటపొలాల మీదుగా వెళ్లిన సమయాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులే తమకు ఉప్పందించారని రైతులు అవే కథలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె కోర్టుకు వివరించారు. పంట వ్యర్థాల దహనంపై 2018లోనే సుప్రీంకోర్టు విస్తృతమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో కోర్టు ముందు నిలిచాయని వ్యాఖ్యానించారు.
లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం
‘పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి. ఒక వేళ కఠిన చర్యలు తీసుకోవడానికి మీకు మనసురాకపోతే ఆ విషయాన్ని అయినా లిఖితపూర్వకంగా మాకు తెలపండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేకుంటే మేమే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముందుగా అరెస్టులు, చర్యలు తీసుకున్నాం. కానీ వీరిలో హెక్టార్ సాగుభూమి ఉన్న రైతులే ఎక్కువ.
వీళ్లను జైల్లో పెడితే, వీళ్లపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటి? గడిచిన సంవత్సరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఘటనలు 77,000 జరిగితే అవి ఏకంగా 10,000 స్థాయికి దిగొచ్చాయి’ అని రాహుల్ మెహ్రా కోర్టుకు నివేదించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘ఎప్పట్లాగా రోటీన్‌గా రైతులకు సూచనలు చేయడం మానేసి ఈసారి అరెస్టులు, జైలుకు పంపడానికి కూడా మేం వెనకాడము అనే గట్టి సందేశాన్ని ఇవ్వండి. వచ్చే పంటకాలంలోపు పొలాల్లో వ్యర్థాలు పర్యావరణహితంగా తొలగించాలి’ అని ఆయా రాష్ట్రాలకు సీజేఐ సూచించారు.