ఢిల్లీ, సాక్షి: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు ఎదుట హాజరైన పలు రాష్ట్రాల సీఎస్‌లు సోమవారం క్షమాపణలు తెలియజేశారు. కోర్టు ఉత్తర్వుల అమలు నేపథ్యంతో సకాలంలో అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై వివరణలు ఇచ్చాకున్నారు. అయితే ఈ వ్యవహారంలో స్పష్టత లేకపోవడంతో మరోసారి అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శలకు సమన్లు జారీ చేసింది.
వీధి కుక్కల అంశం కేసులో ఇవాళ సుప్రీం కోర్టు ఎదుట పలు రాష్ట్రాల సీఎస్‌లు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుపై సకాలంలో అఫిడవిట్లు దాఖలు చేయనందుకు ప్రధాన కార్యదర్శులు క్షమాపణలు చెబుతున్నట్లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. అయితే.. చాలా వరకు రాష్ట్రాలు ప్రమాణ పత్రాలు దాఖలు చేశాయని వెల్లడించారాయన. ఈ క్రమంలో..
జస్టిస్ విక్రమ్‌నాథ్ జోక్యం చేసుకుని.. దాద్రా నగర్ హవేలీ, దామన్ డయ్యూలు అఫిడవిట్లు దాఖలు చేయలేదన్న విషయాన్ని తీసుకొచ్చారు. ఆ వెంటనే సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కలుగజేసుకుని కీలక సమాచారం లేదంటూ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పష్టత ఇవ్వాలని కోరుతూ సమన్లు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
ఇక.. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి పలు కీలక అంశాలపై చార్ట్ రూపొందించాలని సింఘ్వీ సూచించారు. ఆయా రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా చార్ట్ తయారు చేయాలని అమికస్ క్యూరీ గౌరవ అగర్వాల్‌ను సుప్రీం కోర్టు కోరింది. అదే సమయంలో కుక్కకాటు బాధితులను కూడా కేసులో ప్రతివాదులుగా చేర్చాలన్న అభ్యర్థనకూ కోర్టు అంగీకరించింది.
వీధి కుక్కల నియంత్రణకు ఆగస్టులో సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. షెల్టర్ల ఏర్పాటు అంశం పరిశీలన నేపథ్యంలో.. శునకాలను పట్టుకుని, శస్త్రచికిత్స చేసి, తిరిగి వదిలే విధానాన్ని అమలు చేయాలని ఆగష్టు నెలలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
కానీ ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు మాత్రమే స్పందించాయి. అవి కూడా దీపావళి సెలవుల్లో అఫిడవిట్లు సమర్పించడంతో రికార్డుల్లో అధికారికంగా నమోదు కాలేదు. ఈ పరిణామంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం పరువు తీస్తున్నారని.. కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా పోయిందని రాష్ట్రాల సీఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ ఆదేశిస్తూ.. వర్చువల్ విచారణ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
ఏపీ సీఎస్‌కు ప్రశ్న.. 
తమ తీర్పును ఎందుకు అమలు చేయలేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్ ప్రశ్నించారు. అయితే అక్టోబర్ 29న అఫిడవిట్ దాఖలు చేశామని ఏపీ తరఫు న్యాయవాది వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆ రాష్ట్ర సీఎస్‌కు మినహాయింపు లభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు దాఖలు చేసే అఫిడవిట్ల పరిశీలన తర్వాత తదుపరి ఉత్తర్వులు ఉండే అవకాశం ఉంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
