
రేప్ కేసులో 53 ఏళ్ల వ్యక్తికి సుప్రీంకోర్టు నిర్దేశం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాజాగా ఓ అరుదైన కేసును విచారించింది. ఈ కేసులో నిందితుడు 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష సైతం అనుభవించాడు. 2024లో ఇందుకు సంబంధించి దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. నేరానికి పాల్పడినట్లు చెబుతున్న సమయంలో తన వయస్సు 16 ఏళ్లేనంటూ రుజువులు చూపాడు. దీంతో, అతడిని తిరిగి జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం.
రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విచారించిన కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అతడు రాజస్తాన్ హైకోర్టులో సవాల్ చేయగా శిక్షను నిలుపుదల చేస్తూ 2024లో ఆదేశాలిచ్చింది. అనంతరం నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఘటన జరిగిన సమయంలో తన వయస్సు 16 ఏళ్లు మాత్రమేనంటూ అతడు స్కూలు రికార్డులను రుజువులుగా చూపాడు. 1972 జూలై ఒకటో తేదీ పుట్టిన తేదీ అయినందున నేరానికి పాల్పడినప్పటికి తనింకా మైనర్‌నే అంటూ వాదించాడు.
ఈ నెల 23న కేసు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహ్‌ల ధర్మాసనం..వైద్య పరీక్షలు, బాధితురాలు, సాకు‡్ష్యల వాంగ్మూలాలు సరిగ్గానే ఉన్నాయని పేర్కొంది. అయితే, నిందితుడు అందజేసిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైనరేనని నిర్థారణయిందని పేర్కొంది. ఇన్నేళ్ల తర్వాత అతడిని మైనర్‌గా పేర్కొనడం సరికాంటూ రాజస్తాన్ ప్రభుత్వ న్యాయవాది వాదించగా చట్ట ప్రకారం సరైందేనని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో తగు ఆదేశాల కోసం అజ్మీర్‌లోని జువెనైల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. నిబంధనల ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు దోషిని గరిష్టంగా మూడేళ్లపాటు ప్రత్యేక షెల్టర్‌కు పంపించే అవకాశముంది.
జువెనైల్ జస్టిస్ చట్టం ఏం చెబుతోంది?
జువెనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)చట్టం–2015 ప్రకారం నేరం జరిగినప్పటికి ఆ వ్యక్తి వయస్సు 18 ఏళ్లు లోపు ఉండాలి. ఈ కేసుల్లో నిందితులను జువెనైల్ జస్టిస్ బోర్డులే విచారించాలి. సాధారణ కోర్టులు కాదు. వీరికి జీవిత కారాగారం, మరణ శిక్ష వంటివి విధించరాదు. ఈ చట్టంలోని సెక్షన్ 18ని అనుసరించి దోషులుగా తేలిన వారిని కౌన్సెలింగ్ చేయడం లేదా గరిష్టంగా మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే, నేరం జరిగిన సమయంలో అమల్లో ఉన్న జువెనైల్ జస్టిస్ చట్టం–1986ను అనుసరించి 16 ఏళ్లలోపు వారిని బాలురనీ, బాలికలైతే 18 ఏళ్లుగా నిర్వచించారు. 2015 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు బాలబాలికల వయస్సును సమానంగా 18 ఏళ్లుగా నిర్ణయించింది. నిందితుడి ప్రస్తుత వయస్సు, గడిచిన సమయంతో సంబంధం లేకుండా బాల నేరస్థుల వాదనలు చెల్లుబాటు అవుతాయని తాజా కేసు తెలియజేస్తోంది. తీవ్రమైన నేరాల కేసుల్లో సైతం బాల నేరస్తులను భిన్నంగా చూడాలనే సూత్రానికి ఇది బలం చేకూరుస్తోంది.