20 నిమిషాల ఎండతో చర్మ కేన్సర్‌ ముప్పు! | sun exposure ages the skin and raises the risk for skin cancer | Sakshi
Sakshi News home page

20 నిమిషాల ఎండతో చర్మ కేన్సర్‌ ముప్పు!

Jun 1 2026 1:30 AM | Updated on Jun 1 2026 8:06 PM

sun exposure ages the skin and raises the risk for skin cancer

డీఎన్‌ఏ దెబ్బతినటమే కారణం

తేల్చి చెప్పిన హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు

సూర్యరశ్మి వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్‌–డి లభిస్తుందనేది నిజమే. కానీ, అదే సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు మన చర్మ కణాల లోపలికి చొచ్చుకుపోయి డీఎన్‌ఏ నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సన్‌న్‌్రస్కీన్‌ లోషన్‌ లేకుండా కేవలం 20 నిమిషాల పాటు తీవ్రమైన ఎండకు గురైతే చర్మ కేన్సర్‌ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక ’స్కిన్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌’, ‘హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌’పరిశోధకులు వెల్లడించారు.

నిమిషాల్లోనే డీఎన్‌ఏ ముక్కలు!
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చాలా శక్తివంతమైనవి. మనం ఎటువంటి రక్షణ (సన్‌ స్క్రీన్‌ వంటివి) లేకుండా ఎండలో నిలబడిన మొదటి 10 నుంచి 20 నిమిషాలలోపే ఈ కిరణాలు చర్మ కణాల లోపల ఉండే డీఎన్‌ఏ నిర్మాణాన్ని ముక్కలు చేయడం లేదా మార్చడం ప్రారంభిస్తాయని పరిశోధకులు తెలిపారు.

కేన్సర్‌గా ఎలా మారుతుంది? 
డీఎన్‌ఏ దెబ్బతిన్నప్పుడు శరీరం దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ పదేపదే తీవ్రమైన ఎండకు గురికావడం వల్ల ఆ డీఎన్‌ఏ శాశ్వతంగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల చర్మ కణాలు అదుపు లేకుండా పెరిగిపోయి కేన్సర్‌ కణుతులుగా మారతాయి.

ముప్పు 80 శాతం పెరుగుతుంది!
అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ డెర్మటాలజీ అధ్యయనాల ప్రకారం.. కేవలం ఇరవై నిమిషాల ఎండ తీవ్రతకే చర్మం ఎర్రగా కందిపోతుంది (దీనినే సన్‌బర్న్‌ అంటారు). ఒక వ్యక్తి తన జీవితకాలంలో కేవలం 5 సార్లు తీవ్రమైన సన్‌బర్న్‌కు గురైతే, ఆ వ్యక్తికి అత్యంత ప్రమాదకరమైన ‘మెలనోమా’అనే స్కిన్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం 80 శాతం పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి తగ్గుతుంది 
పరిశోధనల ప్రకారం.. ఇరవై నిమిషాల ఎండ తీవ్రత చర్మంలోని రోగనిరోధక కణాలను తాత్కాలికంగా నిర్వీర్యం చేస్తుంది. దీనివల్ల చర్మానికి కేన్సర్‌ కణాలతో పోరాడే శక్తి తగ్గిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు పాడైన చర్మ కణాల డీఎన్‌ఏ, వెంటనే కాకుండా 10 లేదా 20 సంవత్సరాల తర్వాత కేన్సర్‌గా బయటపడొచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
ఎండ తక్కువగా ఉన్నట్టు అనిపించినా, మేఘావృతమై ఉన్నా కూడా బయటకు వెళ్లేటప్పుడు సన్‌ స్క్రీన్‌ రాసుకోవడం, గొడుగు వాడటం లేదా శరీరాన్ని పూర్తిగా కప్పుతూ దుస్తులు ధరించడం వంటి రక్షణ చర్యలు తప్పనిసరి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement