
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా, జపాన్ కోచ్‌లపై వీధి కుక్కలు దాడి చేశాయి. కెన్యా కోచ్ డెన్నిస్ మరాగియా మ్యాన్జో కుడి కాలిపై కుక్క కరవడంతో అతనిని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. జపాన్ కోచ్ మెయికో ఓకుమాట్సు కూడా కుక్కల దాడి బారినపడ్డారు. ఈ ఘటన దరిమిలా స్టేడియం భద్రతా దళం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో వీధికుక్కలను పట్టుకునేందుకు ఢిల్లీ సర్కారు ఉపక్రమించింది.
వివరాల్లోకి వెళితే టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా కోచ్‌ను స్టేడియం ప్రాంగణంలోకి చొరబడిన వీధి కుక్క కరిచింది. దీనిపై అథ్లెట్లు, సహాయక సిబ్బంది తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. కెన్యా స్ప్రింట్స్ కోచ్ డెన్నిస్ మరాగియా మ్వాన్జో వార్మప్ ట్రాక్‌పై అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా కుక్క దాడికి గురయ్యారు. స్టార్టింగ్ బ్లాక్స్‌ను సరిచేస్తుండగా, వీధికుక్క అతని వెనుక నుండి వచ్చి ఆయన కుడి కాలిపై కరిచింది. అక్కడే ఉన్న మెడికల్ టీమ్ ఆయనకు ప్రథమ చికిత్స అందించింది. తరువాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. డెన్నిస్ మరాగియాకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
🚨 Stray dogs bites Kenyan & Japanese coaches at the JLN Stadium in New Delhi during the World Para Athletics C'ship 2025!
Pretty scary & embarassing as host nation 🤦 pic.twitter.com/S3S4OkcP9q— The Khel India (@TheKhelIndia) October 3, 2025
కెన్యా కోచ్‌పై జరిగిన దాడి తరువాత జపాన్ పారా అథ్లెటిక్స్ అసిస్టెంట్ కోచ్ మెయికో ఓకుమాట్సు పైనా కుక్క దాడి చేసింది. దీంతో ఆమె ఎడమ కాలిపై తీవ్ర గాయమయ్యింది. ఈ ఘటనలన్నీ స్టేడియం ట్రాక్‌లోనే జరిగాయి. ఓ సెక్యూరిటీ గార్డును కూడా వీధికుక్క కరిచినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఆర్గనైజింగ్ కమిటీ స్టేడియంలోనికి వీధికుక్కలు రాకుండా చూడాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేసింది. స్టేడియం సమీపంలోనివారు ఇక్కడ కుక్కలకు ఆహారం వేయడంతో అవి లోనికి ప్రవేశిస్తున్నాయని కమిటీ తెలిపింది.