దేశంలో క్రీడలకు ప్రోత్సాహం తగినంతగా లేదు.. లోక్‌సభలో ఎంపీ మార్గాని భరత్ ఆవేదన

Sports are not Encouraged Enough in the country: MP Margani Bharat - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా జనాభా పరంగా చూస్తే మన దేశం రెండవ స్థానంలో ఉన్నా ఆ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసుకునే స్థితిలో మనం ఎందుకు ఉండలేకపోతున్నామనే ఆవేదన నన్ను నిరంతరం దొలిచివేస్తోందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు. గురువారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో భారతదేశంలో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, క్రీడాకారులకు సరైన శిక్షణ, అవసరమైన క్రీడా మైదానాలు, క్రీడా సామాగ్రి సమకూర్చకపోవడాన్ని తప్పుబట్టారు. ఎటువంటి సాధనా లేకుండా యువత క్రీడలలో ఎలా రాణిస్తారని ప్రశ్నించారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు జనాభా పరంగా చూసుకున్నా, ఆర్థికపరంగా చూసుకున్నా అగ్ర స్థానంలో ఉండే మన దేశం క్రీడల విషయంలో ఎందుకు ఆఖరి స్థానంలో ఉండవలసి వస్తోందని ప్రశ్నించారు. ఇదే విషయమై గతంలో ఎంపీ హేమమాలిని కూడా ఆమె ఆవేదనను ఈ సభలో వ్యక్తం చేశారన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన దేశ క్రీడాకారులు రాణించేందుకు అవసరమైన చర్యలను కేంద్ర క్రీడల శాఖ తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు. చాలా చిన్న చిన్న దేశాలు ఒలింపిక్ క్రీడా పోటీలలో తమదైన ప్రతిభ చూపి ఎన్నో పతకాలు పొందుతుంటే మనకు సింగిల్ డిజిట్స్ పతకాలు వస్తే ఏదో ఘనత పొందినట్లు భావించి ఆనందిస్తున్నామే కానీ నిజానికి మన దేశ యువతకు క్రీడల్లో ఉన్న ఉత్సాహాన్ని గుర్తించి ప్రోత్సహించడం లేదని నాకు అనిపిస్తోందన్నారు.

చదవండి: (ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం)

దేశంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడలో గుర్తింపు ఉంటుందన్నారు. బెంగాల్ రాష్ట్రం ఫుట్బాల్ కు, పంజాబ్ హాకీ, ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ ఇలా వివిధ రాష్ట్రాలలో క్రీడాకారులు ఆయా క్రీడలలో సాధన చేస్తుంటారన్నారు. అయితే సరైన కోచ్ లు, సరైన క్రీడా ప్రాంగణాలు, అందుకు తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎలా రాణిస్తారని ఎంపీ భరత్ ప్రశ్నించారు. ఎక్కడో ఆర్థిక స్థోమత ఉన్న ఒకరో ఇద్దరో క్రీడాకారులు నిష్ణాతులైన కోచ్ లను నియమించుకుని శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ, రజత పతకాలు పొందితే అది మన ఘనతగా చెప్పుకోవడం భావ్యమా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహా భారతంలో ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు విలువిద్య నేర్పే ఘట్టాన్ని ఒక ఉదాహరణగా చెప్పారు. శిక్షణ పొందాలంటే లక్ష్యంపైనే గురి ఉంటే అర్జునుడిలా అనుకున్నది సాధించగలడన్నారు.

ద్రోణాచార్యుని వంటి కోచ్ లు, అర్జునుడి వంటి పట్టుదల ఉన్న యువ క్రీడాకారులు ఉన్నా అందుకు తగ్గట్టు ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లేకుంటే ఎలా రాణిస్తారని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అంకితభావం, ఏకాగ్రత ఉండేలా క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా సదుపాయాలు కల్పించగలిగితే ప్రపంచంలో మన భారతదేశం క్రీడలలో అగ్రస్థానంలో ఉండగలదనే ఆశాభావాన్ని ఎంపీ భరత్ వ్యక్తం చేశారు. అలానే శీతాకాలంలో స్విమ్మర్స్ సాధన చేసేందుకు దేశంలో సరైన స్విమ్మింగ్ పూల్స్ లేవని అన్నారు. ఉన్నా వాటి టెంపరేచర్, నిర్వహణ అఙదుకు తగ్గట్టు ఉన్నాయా అనేది అనుమానమేనని ఎంపీ భరత్ అన్నారు. ఇప్పటికైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన దేశ యువత క్రీడల్లో రాణించేందుకు కేంద్ర క్రీడల శాఖ దృష్టి సారించాలని ఎంపీ భరత్ కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top