
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహించి తల్లిని కుమారుడు కడతేర్చాడు. నెల్లై జిల్లా నాంగునేరి మూలైకరైపట్టి సమీపంలోని ఎడుప్పల్ గ్రామానికి చెందిన పూల్పాండి. ఇతని భార్య రెజీనా (43). వీరికి కొంబయ్య (22), వినోద్ (13) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కొంబయ్య కూలీ పనిచేస్తున్నాడు. వినోద్ ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
రెండేళ్ల క్రితం పూల్పాండి మృతిచెందాడు. ఈ నేపథ్యంలో రెజీనా తన కుమారులతో కలిసి ఎడుప్పల్ గ్రామంలో నివసిస్తోంది. కొన్ని రోజులుగా రెజినాకు, ఆమె కుమారుడు కొంబయ్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆ ప్రాంతంలో జరిగిన ఆలయ ఉత్సవాన్ని చూసి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కొంబయ్య తన తల్లితో గొడవపడ్డాడు. ఇనుపరాడ్‌తో రెజీనా తలపై కొట్టి హతమార్చి పారిపోయాడు.
మూలైకరైపట్టి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నెల్లై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో రెజీనా అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉందని కొంబయ్యకు తెలియడంతో తల్లిని మందలించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆలయ ఉత్సవం చూసి కొంబయ్య ఇంటికి వచ్చాడు. ఆసమయంలో రెజీనా, యువకుడు ఏకాంతంగా ఉన్నట్లు తెలిసింది. కొంబయ్య, చూసిన యువకుడు పారిపోయాడు. కొంబయ్య తల్లితో గొడవ పడి తల్లిని హత్య చేసినట్లు తెలిసింది. కొంబయ్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.