ఘనంగా ‘పద్మ’ల ప్రదానం | Six Telugu celebrities received Padma Shri from President Draupadi Murmu | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘పద్మ’ల ప్రదానం

May 26 2026 6:13 AM | Updated on May 26 2026 6:13 AM

Six Telugu celebrities received Padma Shri from President Draupadi Murmu

రాష్ట్రపతి ముర్ము నుంచి దివంగత దిగ్గజ నటుడు ధర్మేంద్ర తరఫున పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకుంటున్న హేమమాలిని. పద్మశ్రీ అవార్డులు అందుకున్న తెలుగు ప్రముఖులు మామిడాల జగదీశ్, విజయ్‌ ఆనంద్‌రెడ్డి, గూడూరు వెంకట్‌రావు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మశ్రీ అందుకున్న ఆరుగురు తెలుగు తేజాలు

తొలి విడతలో 66 మందికి అవార్డులు.. మలివిడతలో మిగిలిన వారికి 

పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. 2026 సంవత్సరానికిగాను వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోదీ, అమిత్‌ షా, కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇద్దరు పద్మవిభూషణ్, ఆరుగురు పద్మభూషణ్‌ పురస్కారాలతోపాటు 58 మంది పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పురస్కారాలు స్వీకరించారు. 

తెలుగు పద్మాలు వీరే.. 
తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు గూడూరు వెంకట్‌రావు, పాల్కొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డి మెడిసిన్‌ విభాగంలో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. కళల విభాగంలో దీపికారెడ్డి పద్మ అవార్డు అందుకోగా సాహిత్యం–విద్య విభాగంలో ఏపీకి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రి పద్మ పురస్కారాన్ని అందుకున్నారు. కళల విభాగంలో మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు పద్మ అవార్డు ప్రకటించగా ఆయన కుమారుడు గరిమెళ్ల అనిల్‌ కుమార్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. కాగా.. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ యూజీసీ చైర్మన్‌ మామిడాల జగదీశ్‌ సాహిత్యం–విద్య విభాగంలో ఢిల్లీ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. 

ధర్మేంద్ర తరఫునఅందుకున్న హేమమాలిని 
దివంగత బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్‌ ప్రకటించగా ఆయన భార్య, బీజేపీ ఎంపీ హేమమాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. కళల విభాగంలో ఎన్‌. రాజమ్‌ పద్మ విభూషణ్‌ అందుకున్నారు. ప్రజావ్యవహారాల విభాగంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, కళల విభాగంలో ఆర్‌. గణేశ్, వాణిజ్యం–పరిశ్రమల విభాగంలో ఉదయ్‌ కోటక్‌ పద్మ భూషణ్‌ అందుకున్నారు. ప్రజావ్యవహారాల విభాగంలో మరణాంతరం వీకే మల్హోత్రాకు పద్మ భూషణ్‌ ప్రకటించగా ఆయన కుమారుడు పురస్కారాన్ని స్వీకరించారు. క్రీడల విభాగంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పద్మశ్రీ అందుకున్నారు. 

తొలి విడతలో 66 మందికి..  
పద్మ అవార్డులను తొలివిడతలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం 66 మందికి ప్రదానం చేశారు. మిగిలిన అవార్డులను త్వరలో నిర్వహించే రెండో విడత కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. 2026కుగాను కేంద్రం మొత్తం 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించడం తెలిసిందే.   

Advertisement
 
Advertisement
Advertisement