బెంగళూరు: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో శుక్రవారం (నిన్న) దారుణం జరిగింది.గోవింద్‌పూర్ గ్రామంలో భూతగాదాలతో ఆరుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఆపై అత్యంత దారుణంగా నరికి చంపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే 'నిరాలే', 'గోలగి' కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గోలగి కుటుంబ సభ్యులు ఈ దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులపై మొదట కాల్పులు జరిపి, ఆ తర్వాత కత్తులతో నరికి చంపారు. మృతిచెందిన వారి వివరాలు చందు నిరాలే, దుండప్ప నిరాలే, శివపుత్ర నిరాలే, రాహుల్ నిరాలే, సమర్థ్ నిరాలే షబ్బీర్ నదాఫ్ గా పేర్కొన్నారు. వీరంతా గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన వారు.
అయితే ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నామని ఇప్పటివరకూ నిందితులను ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.


