సాక్షి, చెన్నై: ఉత్కంఠ రాజకీయాల నడుమ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 3న తేదీన సాయంత్రం 4:10 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. రాష్ట్ర రాజధానిలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావద్దని చంద్రశేఖర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సాయంత్రం జరిగే భేటీలో డీకేను సీఎల్పీ నేతగా ఎన్నుకోన్నారు. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులు హాజరుకానున్నారు. మరోవైపు సీఎల్పీ సమావేశంలో నలుగురు ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీన్ని శివకుమార్ వ్యతిరేకించినట్లు తెలిసింది.
జూన్ 3నే ఎందుకు?
ప్రస్తుతం రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న శివకుమార్‌కు దైవభక్తి ఎక్కువ. ఆయన తన జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్‌ను సంప్రదించిన తర్వాత, జూన్ 3వ తేదీని "శుభ ముహూర్తం"గా నిర్ణయించారు. దీనికి తోడు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆయన అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి కూడా ఈ తేదీని ఎంచుకున్నారు. అంతేకాదు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా సాదాసీదాగా సాగనుందని సమాచారం.డీకేతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వారిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారై ఉంటారని తెలుస్తోంది.
ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా తర్వాత, పార్టీలోని వివిధ వర్గాలను సమతుల్యం చేయడానికి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కొత్త ప్రభుత్వంలో కీలక పోర్ట్‌ఫోలియో (మంత్రి పదవి) దక్కే అవకాశం ఉందని అంచనా. అలాగే సిద్ధరామయ్య రూపంలో ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చినందున, ఈ సామాజిక సమతుల్యత కాంగ్రెస్‌కుకీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మార్గదర్శకాల ప్రకారం దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు. అలాగే, 2028 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువ నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని భావిస్తున్నారు.


