
శివాజీనగర: బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు తరచూ జరుగుతున్నాయి. కాలేజీ విద్యార్థినిని ఆటో డ్రైవర్ వేధించిన ఘటన వెలుగుచూసింది. 8న పుట్టేనహళ్లి ఠాణాలో యువతి (19) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ హనుమంతప్ప తళవార్‌పై కేసు నమోదు చేశారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేందుకు విద్యారి్థని ర్యాపిడో ద్వారా ఆటోని బుక్ చేసింది.
సాయంత్రం 5.15 గంటల సమయంలో ఆమెను ఇంటివద్ద డ్రాప్ చేసిన డ్రైవర్, నీవు సినిమా హీరోయిన్‌లా ఉన్నావు, బ్యాగ్‌ను ఇంటివరకు మోసుకురావాలా అని వ్యాఖ్యలు చేశాడు. ఆమెకు దగ్గరగా వెళ్లి నీకు జ్వరం ఉందా అని ఆమె చెంపను తాకాడు. యువతి అడ్డుచెబుతున్నా అసభ్యంగా ప్రవర్తించసాగాడు, ఆమె భయంతో ఆటో డ్రైవర్‌ను నెట్టివేసి ఇంటిలోకి పరుగులు తీసింది. ఆటోడ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.