ఏడుగురిని ఒకే తరహాలో!.. బ్రిజ్‌ భూషణ్‌పై సంచలన నిందారోపణలు

Shocking Charges Against Wrestling Chief Brij Bhushan In FIRs - Sakshi

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై సంచలన నిందారోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా అథ్లెట్లను అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఒకవైపు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీల్లో సారాంశం ఇప్పుడు బయటకు వచ్చింది. 

మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ కన్నౌట్‌ ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో కిందటి నెలలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అందులో ఆరుగురి ఫిర్యాదుతో ఒక ఎఫ్‌ఐఆర్‌, మైనర్‌ తండ్రి ఫిర్యాదు మేరకు మరో ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు ఫైల్‌ చేశారు. ఏప్రిల్‌ 21వ తేదీన ఫిర్యాదులు అందగా.. వారం తర్వాత వాటిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ఇక ఎఫ్‌ఐఆర్‌లో.. బ్రిజ్‌పై రెజ్లర్ల ఫిర్యాదు మేరకు  సంచలన నిందారోపణలను పోలీసులు చేర్చారు. శ్వాస పరీక్ష పేరిట అభ్యంతరకరంగా తాకడంతో పాటు, వాళ్లను ఇష్టానుసారం పట్టుకోవడం, వ్యక్తిగత ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టడం, లైంగిక కోరికలు తీర్చమని ఒత్తిడి చేయడం, టోర్నమెంట్‌లలో గాయాలు అయినప్పుడు ఆ ఖర్చులు ఫెడరేషన్‌ భరిస్తుందని ఆశజూపి వాళ్లను లోబర్చుకునే ప్రయత్నం చేయడం,  కోచ్‌గానీ.. డైటీషియన్‌గానీ ఆమోదించని ఆహారం అందించడం, అన్నింటికీ మించి మైనర్‌ వెంటపడడంతో పాటు ఆమెను లైంగికంగా తాకుతూ వేధించడం లాంటి నిందారోపణలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. 

‘‘ఆరోజు(ఫలానా తేదీ..) నేను శిక్షణలో భాగంగా మ్యాట్‌ మీద పడుకుని ఉన్నాను. నిందితుడు(బ్రిజ్‌) నా దగ్గరకు వచ్చాడు. అతని ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ టైంలో నా కోచ్‌ అక్కడ లేరు. నా అనుమతి లేకుండా నా టీషర్ట్‌ను లాగేశాడు. నా ఛాతీపై చెయ్యి వేశాడు. ఆ చెయ్యిని అలాగే కడుపు మీదకు పోనిచ్చి.. నా శ్వాసను పరీక్షిస్తున్న వంకతో నన్ను వేధించాడు’’ అని అవార్డు సాధించిన ఓ రెజ్లర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా ఆరుగురి ఫిర్యాదులన్నీ దాదాపు పైతరహాలో ఉండడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ఈ ఆరోపణలన్నింటినీ మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నాడు. ఆరోపణల్లో ఒక్కటి రుజువైనా.. తనను తాను ఉరి తీసుకుంటానని బుధవారం స్టేట్‌మెంట్‌ ఇచ్చాడాయన. అలాగే.. రెజ్లర్ల దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టుకు సమర్పించాలని, నేరం రుజువైతే శిక్షను తాను అభవిస్తానని అంటున్నాడు.

ఇదీ చదవండి: బీజేపీలో ఉన్నానంటే ఉన్నా.. అంతే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top