ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధమైన మధ్యప్రదేశ్‌ సీఎం

Shivraj Singh Chouhan: I Decided To Donate My Plasma For Covid Treatment - Sakshi

భోపాల్‌ : కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. కోవిడ్‌‌-19 పేషెంట్ల చికిత్స కోసం తన ప్లాస్మాను దానం చేయనున్నట్లు శివరాజ్‌ సింగ్‌ ఆదివారం తెలిపారు. కాగా జూలై 25న చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వెంటనే ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందారు. అనంతరం 11 రోజుల తర్వాత ఆగష్టు 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన బట్టలు తానే ఉతుక్కుంటున్నానని వీడియో ద్వారా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న సీఎం చౌహాన్‌ )

కాగా రాష్ట్రంలోని కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన సీఎం.. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. ‘నేను ఇంతకుముందు కరోనా బారిన పడ్డాను. చికిత్స తర్వాత  ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. కరోనా వైరస్‌తో పోరాడటానికి యాంటీబాడీస్‌ నా శరీరంలో వృద్ధి చెంది ఉంటాయి. కావున నేను త్వరలో ప్లాస్మాను దానం చేస్తాను’ అని పేర్కొన్నారు. అయితే కరోనాను అంతం చేయడంలో శరీరంలోని రోగనిరోధకశక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను సేకరించి కరోనా బారిన పడిన వారికి అందించడం ద్వారా వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. ఇక  మధ్యప్రదేశ్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 39,000 వేలు దాటింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top