కంగనా వివాదం : పవార్‌ కీలక వ్యాఖ్యలు

Sharad Pawar Says Maharashtra Government Has Nothing To Do With Kangana Row - Sakshi

కంగనా వివాదంతో మహా సర్కార్‌కు సంబంధం లేదు 

ముంబై : కంగనా రనౌత్‌ వ్యవహారం ముగిసిపోయిన అథ్యాయమని వివాదానికి ఆద్యుడు, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రకటించినా ఈ అంశం సెగలు పుట్టిస్తూనే ఉంది. కంగనాపై వచ్చిన డ్రగ్‌ ఆరోపణలపై నిగ్గుతేల్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసులను కోరింది. మరోవైపు కంగనా వ్యవహారం ఆమెకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సాగుతున్న వార్‌ కాబోదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ శుక్రవారం స్పష్టం చేశారు. కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు వారి నిబంధనల ప్రకారం కూల్చివేశారని, ఇది కార్పొరేషన్‌ నిర్ణయమని బీఎంసీ చెబుతోందని అన్నారు. దీనిపై సోనియా గాంధీ గురించి కంగనా ట్వీట్‌ చేస్తే తానేం చెప్పగలనని పవార్‌ ప్రశ్నించారు. ఇక కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని కూల్చివేసేముందు బీఎంసీ అధికారులు ఆమెకు మరింత సమయం ఇచ్చిఉండాల్సిందని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత చగన్‌ భుజ్‌బల్‌ వ్యాఖ్యానించారు.

గతంలో కంగనా హృతిక్‌ రోషన్‌పై పలు వ్యాఖ్యలు చేసినా ఆయన మౌనం దాల్చడంతో ఆ వ్యవహారం సమసిపోయిందని, బీఎంసీ కూడా హృతిక్‌ను చూసి నేర్చుకోవాల్సిందని అన్నారు. గతంలో హృతిక్‌పై కంగనా ఆరోపణలు గుప్పించినా కొద్దిరోజులు ఆయన మౌనంగా ఉండటంతో ఆ అంశం కనుమరుగైందని, మనం కూడా మౌనంగా ఉంటే ఈ అంశం కూడా సమసిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మహిళను అవమానించారని ఆరోపిస్తూ కంగనాపై వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై కర్ణిసేన, యూపీ మహిళా శక్తి రాష్ట్ర అధ్యక్షురాలు శ్వేతా రాజ్‌ సింగ్‌ ఫిర్యాదుతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సుశాంత్‌ మృతి కేసుకు సంబంధించి ముంబై పోలీసులపై తనకు విశ్వాసం లేదని కంగనా చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలతో శివసేన, బాలీవుడ్‌ క్వీన్‌ల మధ్య వివాదానికి తెరలేచింది. చదవండి : బాలీవుడ్‌ క్వీన్‌కు మరో షాక్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top