పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) పరిధి నుంచి మైనారిటీ స్కూళ్లను మినహాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులతో న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చవద్దని హెచ్చరించింది. న్యాయవ్యవస్థను కూలి్చవేద్దామనుకుంటున్నారా అంటూ దుయ్యబట్టింది. పిటిషనర్‌ను రూ.లక్ష జరిమానా విధించిన న్యాయస్థానం.. ఇలాంటి కేసులు వేయాలనుకునే వారికి ఇదో గుణపాఠం కావాలని వ్యాఖ్యానించింది.
ఆర్టీఈ పరిధి నుంచి మైనారిటీ స్కూళ్లకు మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టీఈ లక్ష్యాలకు వ్యతిరేకమని పేర్కొంటూ యునైటెడ్ వాయిస్ ఫర్ ఎడ్యుకేషన్ ఫోరం అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మీరు సుప్రీంకోర్టులో ఇలాంటి కేసును వేసి మాకు తీవ్ర ఆగ్రహం తెప్పించారు. ఇలాంటి కేసులు దేశ న్యాయ వ్యవస్థ స్థాయిని తగ్గించేవి. ఈ కేసు తీవ్రత ఏమిటో మీకు తెలియదు.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రిట్ వేసినందుకు వాస్తవానికి ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ, ఇప్పటికి వదిలేస్తున్నాం. లక్ష రూపాయల జరిమానాతో సరిపెడుతున్నాం’అంటూ పిటిషనర్‌పై నిప్పులు చెరిగింది. ఇటువంటి కేసులు వేయాలని సలహాలిచ్చే లాయర్లపైనా జరిమానా విధించవలసి ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పు ప్రకారం..విద్యా హక్కు చట్టం నిబంధనలు మైనారిటీ స్కూళ్లకు వర్తించవు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 30(1) మత, భాషాపరమైన మైనారిటీలు సొంతంగా విద్యాసంస్థలను నెలకొల్పుకుని, వాటిని స్వయంగా నిర్వహించుకునేందుకు వీలు కలి్పస్తోంది.


