డ్యాన్స్‌ బార్లు, స్పాలు, ఆర్కేస్ట్రాల్లో బాల కార్మికులు వద్దు! | SC issues notice to Centre seeking strict prohibition of child labour | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌ బార్లు, స్పాలు, ఆర్కేస్ట్రాల్లో బాల కార్మికులు వద్దు!

May 26 2026 1:17 AM | Updated on May 26 2026 1:17 AM

SC issues notice to Centre seeking strict prohibition of child labour

‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయన్స్‌’వినతి 

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: డ్యాన్స్‌ బార్లు, స్పాలు, ఆర్కేస్ట్రాలు వంటి వాటిలో బాలలను పనిలో పెట్టుకోవడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి వాటిపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించింది. వినోదం, ఆతిథ్య రంగాల్లో బాల కార్మీకులను నియమించుకోవడాన్ని కఠినంగా నిషేధించాలంటూ ‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయన్స్‌’అనే సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ పంచోలీల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 

డ్యాన్స్‌ బార్లు, స్పాలు, మసాజ్‌ పార్లర్లు, ఆర్కెస్ట్రాలు, నౌటంకీ ప్రదర్శనల వంటి వాటిలో పిల్లలు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని సీనియర్‌ న్యాయవాది సొనాలీ జైన్‌ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. బాల, కౌమార కార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం–1986లోని సెక్షన్‌–4 కింద కేంద్రం తన అధికారాలను ఉపయోగించి, బాల కార్మిక వ్యవస్థలో పూర్తిగా నిషేధించాల్సిన వృత్తుల జాబితాను విస్తరించాలని కోరారు.  

పిటిషన్‌లో ఏముందంటే 
‘18 ఏళ్లలోపు పిల్లలను ఆర్కెస్ట్రాలు, డ్యాన్స్‌ బార్లు, డ్యాన్స్‌ ట్రూపులు, నౌటంకీ ప్రదర్శనలు, మసాజ్‌ పార్లర్లు, స్పాలు, సెలూన్లు వంటి వాటిలో పనిలో పెట్టుకోరాదు. వారితో ప్రదర్శనలు చేయించరాదు. బాల, కౌమార కార్మీక చట్టం షెడ్యూల్‌లోని ‘పార్ట్‌–ఏ’లో చేర్చి, వర్గీకృత నిషేధం విధించాలి. అశ్లీలంగా లేదా దోపిడీకి గురిచేసే విధంగా పిల్లలను చూపించే సంస్థలన్నిటినీ దీని పరిధిలోకి రావాలి.

 వినోదం ముసుగులో పనిచేస్తున్న సంస్థలతో సహా ఇలాంటి చోట్ల పనిచేస్తున్న పిల్లలను రక్షించి, పునరావాసం కల్పించేందుకు ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌ఓపీ) రూపొందించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆదేశించాలి’అని పిటిషన్‌ కోరింది. చాలా రాష్ట్రాలు 18 ఏళ్ల లోపు వారిని స్పాలు, మసాజ్‌ పార్లర్లలో నియమించుకోవద్దని చట్టాలు చేసినా అమలు కావడం లేదని తెలిపింది. 

వాస్తవానికి వారిని విక్రయించారు 
2025 మార్చి– 2026 మే మధ్య కాలంలో బిహార్, పశ్చిమ బెంగాల్‌లలోని ఆర్కెస్ట్రాలు, డ్యాన్స్‌ గ్రూపుల నుంచి 212 మంది మైనర్లను అధికారులు రక్షించారు. అదేవిధంగా, ఢిల్లీ, రాజస్తాన్‌లలోని మసాజ్‌ పార్లర్లు, స్పాల్లో పనిచేసే 12 మంది బాలలను యంత్రాంగాలు రక్షించినట్లు గణాంకాలు చెబుతన్నాయని పిల్‌ పేర్కొంది. బాధితుల్లో 12 ఏళ్ల లోపువారు కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

 పేదరికంలో ఉన్న వీరికి నృత్య శిక్షణ, సినిమాల్లో పాత్రలు ఇప్పిస్తామనే తప్పుడు వాగ్దానాలతో ప్రలోభపెట్టి తీసుకువచ్చారని అది తెలిపింది. నిజానికి, చాలామందిని రూ.10 వేల నుంచి రూ.50వేలు వరకు విక్రయించారని పేర్కొంది. వారిని అప్పుల ఊబిలో ముంచి మద్యం మత్తులో ఉన్న ప్రేక్షకుల ఎదుట ’లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులలో’ ప్రదర్శనలు ఇచ్చేలా బలవంతం చేశారని పేర్కొంది. దేశంలో గుర్తించిన మొత్తం మానవ అక్రమ రవాణా బాధితుల్లో 44% మంది మైనర్లేనని, స్పాలు లైంగిక దోపిడీకి వేదికలుగా మారినట్లు భారతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’(బర్డ్‌)– 2023 నివేదిక తెలిపిందని పిటిషనర్‌ పేర్కొన్నారు.

వారికి బలమైన రక్షణలు కల్పించాలి 
ప్రస్తుత చట్టంలోని నిబంధనల్లో అనేక లొసుగులు ఉన్నాయని న్యాయవాది సొనాలీ జైన్‌ తెలిపారు. ఈ లోపాలను ఆసరాగా తీసుకుని మనుషుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రంగాల్లో పిల్లలను నియమించుకుంటున్నారని పేర్కొన్నారు. రక్షించిన పిల్లలకు సమర్థవంతమైన రక్షణ, పునరావాసం కల్పించేందుకు బలమైన చట్ట పరమైన రక్షణలు, సంస్థాగత ప్రొటోకాల్‌లు అవసరమని విన్నవించారు. వాదనలను విన్న ధర్మాసనం ఎక్కడెక్కడ బాల కార్మీకులు పనిచేస్తున్నారు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, స్పందనను వెంటనే తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌), జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లకు నోటీసులు జారీ చేసింది.   

Advertisement
 
Advertisement
Advertisement