మహిళలపై వరకట్న వేధింపులు, హత్యలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళను అత్తారింట్లో వేధించి, ఉరివేసుకుని చనిపోయేలా చేసిన ఒక కేసు విచారణ సందర్భంగా భారత సుప్రీంకోర్టు శుక్రవారం వరకట్న వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అబ్బాయిలు అమ్మాయిల్ని పెళ్లిళ్లు చేసుకోవడం, ఎందుకు, ఆ తరువాత వారిని, వారి కుటుంబ సభ్యులు పీడించుకు తినడం ఎందుకు అని ప్రశ్నించింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ, భర్త కుటుంబ సభ్యుల ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టింది. సమాజానికి ఒక బలమైన హెచ్చరిక వెళ్లాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న సామాజిక పరిస్థితులను ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు అబ్బాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత వారిని, వారి కుటుంబాలను ఎందుకు అవమానిస్తారు? వధువును, ఆమె కుటుంబంపై వేధింపులు ఇక చెల్లవనే సందేశం సమాజానికి వెళ్లాలని పేర్కొన్నారు. చదువుకున్న సమాజంలో కూడా ఇలాంటి ప్రవర్తన సాధారణం అయిపోతుండటంపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా ఉన్నత చదువులు చదవినవారు అంటూ అసహనం ప్రకటించారు.
2010లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన (సుచిత్ కేసరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్)కేసు ఇది. పెళ్లయిన మూడేళ్లలోనే ఒక మహిళ అత్తారింట్లో ఉరివేసుకుని మరణించింది. భర్త, అతని కుటుంబ సభ్యులు నగదు, కారు ఇవ్వాలని నిరంతరం వేధింపులకు గురిచేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
పెళ్లయిన ఏడేళ్లలోపు అసాధారణ పరిస్థితుల్లో మరణం సంభవించడంతో, ఇది వరకట్న మరణం (Statutory Presumption of Dowry Death) కిందకు వస్తుందని ట్రయల్ కోర్టు నిర్ధారించింది. ఆమె చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కూడా డబ్బుల కోసం వేధించినట్లు వధువు కుటుంబ సభ్యులు సాక్ష్యాలు సమర్పించారు.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు
పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె ఉరివేసుకోవడం వల్లే చనిపోయిందని తేలినప్పటికీ, దానికి దారితీసిన పరిస్థితులు, నిరంతర వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కోర్టులు నిర్ధారించాయి. దీనితో భర్త కుటుంబ సభ్యులకు సెక్షన్ 304B (వరకట్న మరణం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 498A (మహిళలను వేధించడం) కింద శిక్ష పడింది. దీనిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కూడా సమర్థించింది.
498A కింద పడిన శిక్షలు రద్దు చేయాలంటూ
మరణించిన మహిళ భర్త తమ్ముడు తనకు సెక్షన్ 498A కింద పడిన శిక్ష నుండి ఉపశమనం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతని తరపు న్యాయవాది వాదిస్తూ, తన క్లయింట్‌పై కేవలం 498A సెక్షన్ మాత్రమే ఉందని, ఆ నేరం కూడా రుజువు కాలేదని పేర్కొన్నారు. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. కేవలం 498A సెక్షన్ మాత్రమే , మూడేళ్లే శిక్ష పడినందుకు సంతోషించండి అంటూ చురకలేశారు జస్టిస్ నాగరత్న.
ఈ సందర్భంగా అత్తారింట్లో జరిగే వేధింపుల తీరును ఆమె ఎత్తిచూపారు. "ఇది వధువును, ఆమె కుటుంబాన్ని పీడించుకు తినే నైజం. భర్త కుటుంబం వధువు తరపు వారిని 'మీరు అడుక్కునేవాళ్లు (Beggars), డబ్బులు ఇవ్వలేరు' అని నిందించింది. ఆ తండ్రి కూతురిని కాపాడుకోవడానికి ప్రాధేయపడుతుంటే, వారిని భిక్షగాళ్లని పిలుస్తారా? వధువు తండ్రి రూ. 60 వేలు ఇస్తానన్నా కూడా మీరు వారిని అడుక్కునేవాళ్లని అంటారా?" అని జస్టిస్ నాగరత్న నిలదీశారు. ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించగా, కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. చివరకు, సుప్రీంకోర్టు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ, నిందితుడి అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ కేసులో పిటిషనర్ తరపున అడ్వకేట్ రిషి జైస్వాల్ హాజరయ్యారు.


