చురు జిల్లా: రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్‌లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది. భారీ దుమ్ము కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. సోషల్ మీడియాలో దుమ్ము తుపాను సంబంధించి వీడియోలు వైరల్‌గా మారాయి.
వీధుల గుండా బలమైన ఈదురుగాలులు, దట్టమైన దుమ్ము మేఘాలు కనిపించాయి. దీంతో ఆకాశం ముదురు నారింజ-గోధుమ రంగులోకి మారిపోయింది. ఒక్కసారిగా ఇసుక తుపానుతో ప్రయాణికులు స్థానికులు ఇళ్లలోనే ఆశ్రయం పొందారు. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రాంతంలో తీవ్రమైన ఎండల తర్వాత బలమైన గాలులు, దుమ్ము తుపానులు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉత్తర భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎడారి వేడి గాలులు పరస్పరం చర్య జరిపినప్పుడు.. ముఖ్యంగా రుతుపవనాల ముందు వచ్చే ముందు రాజస్థాన్‌లో ఇటువంటి దుమ్ము తుపానులు సహజమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇసుక తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో అనవసరమైన ప్రయాణాలను చేయొద్దని.. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, దుమ్ము లేచే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.


