పట్నా: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బిహార్‌లో బీజేపీ పార్టీ తరపున ప్రమాణ స్వీకారం చేసిన తొలి సీఎంగా సామ్రాట్ చౌదరి రికార్డు సాధించారు.
కాగా నిన్న మాజీ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.
సామ్రాట్ చౌదరి నేపథ్యం
సామ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.
సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు.
రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్‌లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే.


