కోటక్‌ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలం | Rs 160 Crore FD Fraud Hits Kotak Mahindra Bank In Haryana | Sakshi
Sakshi News home page

కోటక్‌ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలం

Mar 25 2026 1:30 PM | Updated on Mar 25 2026 1:49 PM

Rs 160 Crore FD Fraud Hits Kotak Mahindra Bank In Haryana

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం మరువకముందేమరో బ్యాంకులో జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. హర్యానాలో  కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో రూ. 160 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి

హర్యానాలోని పంచకుల మునిసిపల్ కార్పొరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ దాదాపు రూ. 160 కోట్లు. అయితే, ఎఫ్‌డీల్లో జమ చేసిన  నధులు అసలు డిపాజిట్టే కాలేదు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ సొమ్మును ఇతర మోసపూరిత ఖాతాలకు మళ్లించారు. ఇందుకోసం హర్యానాకు చెందిన పంచకుల మున్సిపల్ కార్పొరేషన్‌కు నకిలీ పత్రాలను జారీ చేశారని అధికారులు గుర్తించారు. ఈ భారీ మోసంలో బ్యాంక్ ఉద్యోగులతో పాటు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం కూడా ఉండవచ్చని  పోలీసులు అనుమానిస్తున్నారు.

వెలుగులోకి ఎలా వచ్చింది?
రూ. 58 కోట్ల విలువైన ఒక FD గడువు ముగిసిన తర్వాత, ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయాలని కార్పొరేషన్ బ్యాంకును కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు స్టేట్‌మెంట్ ప్రకారం బదిలీ పూర్తయినట్లు చూపించినప్పటికీ, ఆ నిధులు కార్పొరేషన్ ఖాతాకు చేరలేదు. ఆరా తీస్తే ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా నకిలీదేనని నిర్ధారణ అయ్యింది.డబ్బు మాయమైపోయిందని తేలింది. ఈ వ్యవహారంలో బ్యాంకు జారీ చేసిన FDలన్నీ నకిలీవని, ఖాతాలో అసలు నిధులే లేవని గుర్తించారు. నకిలీ పత్రాలను ఉపయోగించి బ్యాంకు ఉద్యోగులు చాలాకాలం పాటు ఈ నిధుల దుర్వినియోగాన్ని దాచిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

తమ ఎఫ్‌డీ నిధులను బదిలీ చేయమని బ్యాంకును కోరినప్పుడే ఈ వ్యవహారం బైటపడిందని, పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్  తెలిపారు. ఇదే  విషయాన్ని స్టేట్ విజిలెన్స్‌కు నివేదించారు. బ్యాంక్‌పై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడంతో పాటు, ఆ బ్యాంక్‌ను ప్రభుత్వ పనుల నుండి తొలగించాలని (de-empanel) హర్యానా ప్రభుత్వాన్ని కోరారు. అటు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

కాగా గత నెలలోనే చండీగఢ్‌లోని ఐడిఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) శాఖలో హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 590 కోట్ల నిధులు ఇలాగే మాయమయ్యాయి. ఆ కేసులో బ్యాంక్ ఇప్పటికే పూర్తి సొమ్మును ప్రభుత్వానికి తిరిగి చెల్లించింది. ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో కూడా ఇలాంటిదే జరగడం కలకలం రేపుతోంది
 

Advertisement
 
Advertisement
Advertisement