పుదుచ్చేరి: ఓటర్లలో ఉత్సాహం కల్గించేందుకు ఎన్నికల అధికారులు ఓ వినూత్న ప్రయోగం చేపట్టారు. రోబోను రంగంలోకి దించారు. నీలం అనే పేరుగల ఈ రోబో లంగా ఓణీతో పూలున్న ప్లేట్‌ను చేతులతో పట్టుకుని క్యూలో నిలబడ్డ ఓటర్లకు ఆహ్వానం పలుకుతూ, వారిని పలకరిస్తూ పోలింగ్ బూత్ వరండాలో ముందుకు సాగింది.
ఓటుహక్కు వినియోగించుకోవాలని, వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలని కోరింది. పుదుచ్చేరిలోని రాజ్‌భవన్ నియోజకవర్గంలో వీవోసీ ప్రభుత్వ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బూత్ వద్ద గురువారం ఈ రోబో అందరినీ ఆకర్షించింది. స్కూల్‌లో ఏర్పాటైన మోడల్ బూత్‌లో చెన్నై నుంచి తెప్పించిన రోబో ‘నీల’తో తాము చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని జిల్లా ఎన్నికల అధికారి కుళోత్తుంగన్ చెప్పారు. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.


