
న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె భర్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త మనీష్ గుప్తా ప్రభుత్వ సమావేశంలో ఆమె పక్కన కూర్చోవడంతో ఢిల్లీ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించడానికి జరిగిన సమావేశానికి మనీష్ గుప్తా హాజరయ్యారు.
సమావేశంలో సీఎం రేఖా గుప్తా భర్త పసుపు రంగు చొక్కా ధరించి, ఆమె పక్కన కనిపిస్తున్నారు. ఇది ప్రతిపక్ష నేతల దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్‌ఛార్జ్ సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ, ఢిల్లీ ప్రభుత్వంలో రేఖా గుప్తా భర్త మనీష్ భాగస్వామి కానప్పుడు అతనిని అధికారిక సమావేశంలో కూర్చొనేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసే చర్య అని ఆయన ‘ఎక్స్’ పోస్టులో రాశారు.
కాంగ్రెస్‌లో వంశపారంపర్య రాజకీయాలున్నాయన్న బీజేపీ ఇప్పుడు సీఎం రేఖా గుప్తా విషయంలో ఏమి మాట్లాడుతుందన్నారు. ముఖ్యమంత్రి తన భర్తకు అధికారాలు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా రేఖా గుప్తాను విమర్శిస్తూ, ప్రధాని మోదీ ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించారని అన్నారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయితే, ఆమె భర్త సూపర్ ముఖ్యమంత్రి అని విమర్శించారు.