
ఒక్క ప్రాణం కాపాడిన.. వాడిని దేవుడితో సమానం అంటారు కదా. అలాంటిది తన చివరిక్షణాల్లోనూ పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడాడు ఇక్కడో డ్రైవర్. హృదయ విదారకమైన ఈ ఘటన బస్సులోని సీసీటీవీల్లో రికార్డయ్యింది.
రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కదిలే బస్సులో ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా.. దానికంటే కొన్ని నిమిషాల ముందే అతను డ్రైవర్ సీటు నుంచి తప్పకుని హెల్పర్‌కు స్టీరింగ్ అప్పగించాడు. ఈ ఘటన అక్కుడున్నవాళ్లను తీవ్రంగా కలిచివేసింది.
మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి జోధ్‌పూర్ రాజస్థాన్‌కు ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు వెళ్తోంది. బస్సు పాల్వి జిల్లా కేల్వా రాజ్‌నగర్ చేరుకోగానే.. డ్రైవర్ సతీష్ రావు తనకు ఒంట్లో ఏదోలా అనిపించడంతో వెంటనే స్టీరింగ్‌ను సహచర డ్రైవర్‌కు అప్పగించారు. దగ్గర్లో ఏదైనా క్లినిక్, మెడికల్ షాప్ ఉంటుందోనని చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అస్వస్థతతోనే సతీష్ బస్సులో అలాగే ముందుకు సాగారు.
కాసేపటికే అకస్మాత్తుగా మూర్చపోయి కుప్పకూలిన దృశ్యం కనిపించింది. ప్రయాణికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సైలెంట్ హార్ట్ అటాక్ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడారంటూ సతీష్‌పై అంతా ప్రశంసలు గుప్పిస్తూ నివాళులర్పిస్తున్నారు.